27 May, 2026 | 2:59 AM

డ్రైవర్ అశోక్‌ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి

27-05-2026 02:05 AM

కేసముద్రం, మే 26 (విజయక్రాంతి): జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ నేతల ధర్నా వద్ద ‘ముందు రైతుల నుంచి వడ్లు, మొక్కజొన్నలు కొనండి’ అని సాదాసీదాగా తనకు తెలిసిన వ్యక్తులను అడిగినందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదని, వెంటనే అతని విధుల్లోకి తీసుకోవాలని కేసముద్రం మండల కేసముద్రం మండల భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలకు కొట్టుకుపోతుంటే, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం రవాణాను వేగవంతం చేయాలని కోరడం ఏ రకంగా నేరమవుతుందని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో సామాన్యుడికి ఉండే కనీస వాక్ స్వాతంత్య్రాన్ని కూడా కాలరాస్తూ, కాంగ్రెస్ పార్టీ ధర్నాను విమర్శించాడనే నెపంతో ఒక గరీబ్ కార్మికుడి పొట్ట కొట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

ధర్మాపురి కాంగ్రెస్ నాయకుల కంప్లైంట్ ఆధారంగా జగిత్యాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఇంత వేగంగా రిమూవల్ లెటర్ జారీ చేయడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రైతుల, కార్మికుల పక్షాన నిలబడేందుకు బీజేపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. అన్యాయానికి గురైన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో కార్మికులు, రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఉప్పునూతల రమేష్ ,మండల ప్రధాన కార్యదర్శి బోనగిరి ఉపేందర్, ,మున్సిపల్ కన్వీనర్ బోగోజు నాగేశ్వరాచారి , మండల కోశాధికారి వేముల సతీష్ రెడ్డి హెచ్చరించారు.