చెరువును కాస్తా కాలువ చేశారు
- మింగుడుపడని మినీట్యాంకు బండ్
- పనికిరాని రాళ్లతో రివీట్‌మెంట్
- పూడికతీత పనుల్లో నిబంధనలకు తూట్లు
- చోద్యం చూస్తున్న అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 25(విజయక్రాంతి): చెరువును కాస్తా కాలువ చేశారు. ఒకవైపు ఆక్రమణలు, మరోవైపు చెరువుకట్ట పెంచడంతో విశాలంగా ఉండే చెరువు కాస్తా కాలువగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచలోని చింతలచెరువుపై ప్రత్యేక అభివృద్ది నిదులు రూ 10కోట్లతో మినీట్యాంకు బండ్ నిర్మాణం చేపట్టారు. చేపట్టి న మీనీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు వదిలారు. నీటిపారుదల శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ఈ అభివృద్ది పనుల్లో కాంట్రాక్టర్ నిబందనలకు నీళ్లు వదిలి ఇష్టానుసారం పనులు చేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని, చెరువును కాస్తా కాలువగా మార్చారని, సాగునీటి నీటి నిల్వ సామార్ద్యనికి గండి కొడుతున్నారని రైతు సంఘాలు, రైతలు ఆరోపిస్తు న్నారు.
ఒకవైపు పెద్ద ఎత్తున చెరువుశిఖం భూములు ఆక్రమణ, మరో వైపు ట్యాంక్ బండ్ నిర్మాణం పేరుతో కట్ట పెంచడంతో పొలాలకు సాగునీరు ప్రశ్నార్ధకంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్వే నెం 70లో సుమారు 95 ఎకరాల చెరువు విస్తీర్ణం ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 45 నుంచి 50 ఎకారలు మాత్రమే ఉంది. అంతే కాందు నాళా చట్టం నిబందనల ప్రకారం చెరవులోకి నీరు చేరువులోకి వచ్చేమార్గం క్యాచ్‌మెంటో పరిదిలో పట్టా భూమి ఉన్నా ఎలాంటి పర్మినెంట్ కట్టడాలు చేయారని నిబంధన ఉన్నా, దాన్ని అతిక్రమించి చెరువు క్యాచ్‌మెంట్ ఏరియాలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించినా అధికారులు కళ్లు మూసుకొంటున్నారు. శిఖం బూమినే కాదు ఏకంగా చెరువును కబ్జా చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తు న్నారు.
అదాలా ఉంటే ట్యాంక్ బండ్ నిర్మా ణం పేరుతో చెరువకట్టను ఏకంగా50 అడుగుల పెంచి కట్ట పోయడంతో చెరువు కాస్తా కాలువగా మారింది. కట్టకు రాళ్లతో రివీట్ మెంట్ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. రివీట్‌మెంట్‌కు వాడాల్సిన రాళ్లను క్వారీల్లో పనికిరాకుండా వదిలేసిన, ఆకారంలేని సైజు రాళ్లతో రివిట్‌మెంట్ చేస్తున్నారు. ఒకే సైజుతో ఒకే మందంతో ఉన్న రాళ్లతో సక్రమంగా రివిట్‌మెంట్ చేయాల్సి ఉండగా వివిద సైజులు, మందంతో కూడిన రాళ్లను అడ్డదిడ్డంగా పేర్చుకొంటు పోతున్నారు. పనులపై పర్యవేక్షించాల్సిన అధికా రులు ఏమి పట్టనట్లు వ్యవహరించడంపై అనేక అనుమానాలు వెలువడుతున్నాయి.
పనుల్లో నాణ్యత లేమి కొట్టొచినట్లు ఉందని రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు చెరువులో మట్టి పూడిక కేవలం 1.6మీటర్లు లోతులో సమానంగా మట్టిని తొలగించాల్సి ఉండగా ప్రొక్లేయిన్ యజమానులు తమ ఇష్టానుసారం పెద్ద పెద్ద గోతులు తవ్వి మట్టిని తరలిస్తున్నారు. దీంతో చెపల పెంపకదారులు చేపల వేటకు వెళ్లినా, పశువులు తాగునీటికోసం చెరువులో దిగినా ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు పూడిక మట్టి కేవలం ఆ చెరువు పరిదిలోని ఆయకట్టు రైతులకు మాత్రమే ఉచితంగాతోలాల్సి ఉంది.
కాని అధికారుల కనుసన్నాల్లో పాల్వంచ పరిదిలో కాకుండా కొత్తగూడెం, లక్ష్మిదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మట్టి తోలకాలు చేశారు. లక్షల విలువగల మట్టి తరలించారు. జిల్లా కలెక్టర్ పాతపాల్వంచ చింతల చెరువుపై నిర్మిస్తున్న మినీ ట్యాంకుబండ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి జరిగిన ఆక్రమణలు, జరుగుతున్న నాసిరకం పనులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నిర్మాణంలో తీవ్రజాప్యం
చింతలచెరువు నిర్మాణంపై చేపట్టిన మినీ ట్యాంకు బండ్ నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకొంది. రూ 10కోట్లతో చేపట్టిన పనులు వాస్తవంగా ఈఏడాది ఫిబ్రవరిలో పూర్తి కావాల్సి ఉంది. పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో మరో ఆరునెలలు పెంచి ఈఏడాది ఆగస్టు వరకు పూర్తి చేయాల్సి ఉంది. వాస్తవంగా గత ఏడాది ఆగస్టులో సీవీఆర్ కనస్ట్రక్షన్స్ పనులను పొంది రూ 6కోట్లతో అగ్రిమెంటు చేసుకొన్నారు. కట్టను 15మీటర్లు పెంచి మద్యలోసెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు చేస్తూ, బీటిరోడ్డు వేయడానికి, చెరవులోపలివైపు కట్టకు రివిట్ మెంట్ చేయడానికి అంగికారం కుదుర్చుకొన్నారు. ఈఏడాది ఆగస్టు వరకు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి ఇంకా 50శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఒకవైపు వ్యవసాయ సీజన్ ముంచుకొచ్చింది, మరోవైపు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వర్షాలు అధికమైతే పనులు ముందుకు సాగవు దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నాణ్యత లేకుంటే చర్యలు: డీఈ రాణి
మినీట్యాంకు బండ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తీసుకొంటామని, అవసరమైతే పనులు తిరిగి చేయిస్తామని నీటిపారుదలశాఖ డీఈ రాణి చెప్పారు. చెవురులో నీటి సామర్ద్యం విషయంలో రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రివిట్‌మెంట రాళ్లసైజు అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లితే పరిశీలించి చర్యలు తీసుకొంటామన్నారు.






