సీపీఎస్ రద్దు చేయాలి
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీ చేసిన ఉద్యోగులకు తిరిగి వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని 40 ఉద్యోగ సంఘాలతో జేఏసీ ఏర్పాటు లక్ష్యంగా టీఎన్‌జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్, ఏలూరి మాట్లాడుతూ 2018 నుంచి ఉద్యోగుల బదిలీలు జరగనందున తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
గచ్చిబౌలిలోని టీఎన్జీవో రెండో ఫేస్‌లో101 ఎకరాల్లో యాజమాన్య హక్కులను సొసైటీకి కల్పించాలన్నారు. భాగ్యనగర్ టీఎన్‌జీవో హౌస్ సొసైటీ ఇండ్ల స్థలాల కేటాయింపులో 1088 ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. ఉద్యోగుల షేరింగ్‌తో కూడిన ఆరోగ్య పథకాన్ని ప్రవేశ పెట్టాలన్నారు. పెండింగ్ ప్రమోషన్లను తక్షణమే అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. సచివాలయంలోకి హెచ్‌ఓడీలను తీసుకోవడానికి 12.5 శాతం కోటా అమలు చేయాల న్నారు. ఆదాయ పన్ను పరిమితిని పెంచాలన్నారు. అక్రమ ఆస్తుల కేసులు నమోదును అరికట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.






