23 July, 2026 | 1:48 AM

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలి

23-07-2026 12:00 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి. జులై 22 (విజయ క్రాంతి)పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిం చేందుకు అవసరమైన పరికరాల కోసం ప్ర తిపాదనలు పంపాలని సూచించారు. ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడం, ఇతర ప్రాంతాలకు వెళ్లిన సిబ్బందిని తిరిగి రప్పించడం అవసరమని తెలిపారు.ఆసుపత్రిని 100 పడకల నుండి 200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రసూతి, ఎముకలు, కంటి, మత్తు వైద్యం, దంత, చిత్రీకరణ, అత్యవసర సేవలు, సాధారణ వైద్యం, చిన్నపిల్లల వైద్యం విభాగాల్లో పరికరాలు, సిబ్బంది కొరత ఉందని వైద్యులు తెలిపారు. నెలకు సుమారు 190 ప్రసవాలు జరుగుతున్నాయని వివరించారు.రక్త నిల్వ గది, ఆక్సిజన్ సౌకర్యం, రక్త బ్యాంకు సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన యంత్రాలు, సాంకేతిక నిపుణుల కోసం ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, నిల్వ ఇంధనం సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అంబులెన్సుల మరమ్మతులు చేయాలని, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రత్యేక గుర్తింపు సేవల గది ఏర్పాటు చేయాలని, వైద్య సేవలకు అవసరమైన పరికరాల ప్రతిపాదనలు వెంటనే పంపాలని తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ప్రధాన వైద్యశాల పర్యవేక్షకులు డా. రాజేంద్రప్రసాద్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మధుసూదన్, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, ఉప పర్యవేక్షకులు డా. వెంకట రత్నం ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.