గిరిజన హాస్టల్ దినసరి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ పాఠశాల దినసరి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు, ఇతర అలవెన్స్ లు అమలు చేయాలని సిఐటియు మహబూబాబాద్ పట్టణ కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని గత రెండు రోజులుగా ఆర్డిఓ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం దీక్ష శిబిరాన్ని సందర్శించిన నాగన్న మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్ లో దినసరి, పార్ట్ టైం వర్కర్లుగా అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని అయితే సమాన పనికి సమాన వేతనం వారికి దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 64 ప్రకారం వేతనాలు చెల్లించాలని మౌలిక ఆదేశాలు ఇచ్చారని, దీని ఫలితంగా వేతనాలు బాగా తగ్గుతున్నాయని, జీవో నెంబర్ 64 ను అమలు నిలిపివేయాలని ఇప్పుడు చెల్లిస్తున్న విధంగానే జిల్లా కలెక్టర్ కనీస వేతనాల గెజిట్ ప్రకారం యధావిధిగా వేతనాలు చెల్లించాలని, 212 జీవోను సవరించి 2014 నాటికి ఐదు సంవత్సరాల సర్వీసు ఉన్న వారందరినీ పర్మినెంట్ చేయాలని పెండింగ్ వేతనాలు చెల్లించుటకు ట్రెజరర్లకు తగు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గత సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని, కొత్త మెనూ వల్ల పెరిగిన పనిభారానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, పూర్తి కాలం పనిచేస్తున్న కార్మికులకి పూర్తి వేతనం చెల్లించాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను డైలీ వేజ్ వర్కర్లుగా నియమించాలని, విద్యార్థులతో పాటు కార్మికులకు కూడా రెండు జతల యూనిఫాం, ఐడి కార్డు, ప్రతి వర్కర్ కి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పతి వర్కర్ కి ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. చనిపోతే మట్టి ఖర్చుల కింద 50 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని లేకపోతే రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న వర్కర్లందర్నీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ వెంకన్న, భూక్యా మహేష్, హలవత్ లింగ్యా, పెనక ముత్తయ్య, జే. మంగ, కే.ఇంద్రమ్మ, ఎస్. నాగరాజు, లత, మంగి లాల్, వెంకన్న, కుమార్, రాములమ్మ, యాకమ్మ పాల్గొన్నారు.






