04-02-2026 02:04:02 AM
అభ్యర్ధులకు బి ఫారాలు అందజేత
భద్రాద్రికొత్తగూడెం, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కొత్తగూడెం కార్పోరేష్ప ఎర్రజెండా ఎగరాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్పోరేషన్ ఎన్నికలకు సంబందించి బరిలో ఉన్న అభ్యర్థులకు మంగళవారం స్థానిక శేషగిరి భవన్ సిపిఐ కార్యాలయం లో ఆయన బి ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఈనెల 11న జరగనున్న కొత్తగూడెం కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా సిపిఐ తన అభ్యర్థులను ప్రకటించిందని, టిడిపి, ప్రజా సంఘాల మద్దతుతో భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ప్రజాక్షేత్రంలోకి వెళుతుందని చెప్పారు.
సిపిఐ బలపరిచిన అభ్యర్ధుల విజయానికి ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగానే కొత్తగూడెం కార్పోరేషన్ వ్యాప్తంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ముఖ్యమంత్రి, మంత్రులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నామనే భావన వద్దన్నారు. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాల్లో భాగంగానే ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. గత రెండేళ్లలో కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు జరిగిందని, మారుమూల ప్రాంతాల్లో సైతం మౌళిక సదుపాయాల కల్పనకు శక్తివంచన లేని కృషి చేశామన్నారు.
కార్పోరేషన్ ఏర్పాటుతో పాల్వంచ పరిధిలో 25నం. తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయని, దీంతో ఆ ప్రాంత అభివృద్ధి శరవేగం కానుందన్నారు. కార్పోరేషన్ కాకుండా ఆనే శక్తులు కుట్రలు పన్నాయని, వారి కట్రలు, కుతంత్రాలను పటాపంచలు చేస్తూ తామిచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం అనతికాలంలోనే కొత్తగూడెం కార్పోరేషను ప్రకటించిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. కార్పోరేషన్ పై ఎర్రజెండా ఎగిరేందుకు ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు.