18 April, 2026 | 2:34 PM

మా పోరాట ఫలితమే.. బనకచర్లకు బ్రేక్

01-01-2026 02:16 AM
  1. ఏపీ ప్రణాళికలను అడ్డుకొని రాష్ట్ర నీటి వాటాను రక్షించాం 
  2. గోదావరి నీళ్ల మళ్లింపును అంగీకరించే ప్రసక్తే లేదు 
  3. అదనపు నీటిపై ఆ రాష్ట్రానికి హక్కు లేదు..
  4. ఏపీ ఏకపక్ష చర్యలను అడ్డుకుంటాం 
  5. ప్రతిపక్షాల ఆరోపణల్లో ఆవగింజంతైనా వాస్తవం లేదు 
  6. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి) : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన పోరాటం ఫలితంగానే బనకచర్ల ఆగిపోయిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలకు భిన్నంగా గోదావరి జలాల మళ్లింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలను ముమ్మాటికి అడ్డుకుని గోదావరి జలాశయాలల్లో తెలంగాణ వాటా పరిరక్షించామని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం మొదటగా రూపొందించిన పోలవరం- తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడంతో కొత్తగా అక్కడి ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పేరు మార్చి పోలవరం--నల్లమల్ల సాగర్‌గా సరికొత్త ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాశయాల్లో 200 టీఎంసీల నీటిని మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

1980 గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ తీర్పు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, కేంద్ర జలవనరుల సంఘం మార్గదర్శకాల ఉల్లంఘనకు అక్కడి ప్రభు త్వం పాల్పడుతున్నదని మంత్రి మండిపడ్డారు. కృష్ణా బేసిన్‌కు ముందుగా అనుమ తించిన 80 టీఎంసీల నీటిని మించి ఉమ్మ డి జలాశయలలో అధిక వినియోగంపై హక్కు కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయ త్నం చేస్తుందని తెలిపారు.

అదనపు వాటాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించే ప్రసక్తే లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తు న్న ప్రయత్నాలను న్యాయపరంగా, నిలువరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రణాళికలు వెలుగులోకి రాగానే తక్షణమే స్పందించి 22 జనవరి 2025 న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖాకు, జూన్13, 16 తేదీలలో జలశక్తి శాఖతో పాటు పర్యావరణ, అటవీ శాఖల మంత్రిత్వ శాఖలకు తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడు తూ చేసిన ప్రతిపాదనలను తిరస్కరించాలని డిమాండ్ చేసిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలతో జూన్ 30, 2025న పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తిరస్కరించిందని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కారం కాలేదని, జీడబ్ల్యూడీటీ నిబంధనలకు విరుద్ధమని, వరద నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అనుమతి అవసరమని కమిటీ పేర్కొందని వెల్లడించారు. కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణ నదీ యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీలకు కూడా తెలంగాణ అభ్యంతరాలు తెలిపిందని వివరించారు.

జూలై 2025లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో గోదావరి, కృష్ణ బేసిన్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలను అజెండాలో పెట్టాలని తెలంగాణ కోరిందని, అయినా కూడా ఆంధ్రప్రదేశ్ నవంబర్ 21, 2025న పీఎన్‌ఎల్పీ కోసం డీపీఆర్ టెండర్లు పిలవడంతో, తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 16, 2025న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ నెం.1258/2025 దాఖలు చేసిందని తెలిపారు. ఈ పిటిషన్‌లో పీబీఎల్పీ/పీఎన్‌ఎల్పీ పనులను నిలిపివేయాలని, కేంద్ర సంస్థలు అనుమతులు, నిధులు ఇవ్వకుండా ఆపాలని, అనుమతి లేని సామర్థ్య విస్తరణలు, టెండర్లు నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు.

గోదావరిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి హక్కులను కాపాడుకోవడమే మా ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేస్తున్నామని ప్రతిపక్షాలు చెప్పడం అసత్యమని, తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వేగవంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతోటే  ఈ ఏడాది ఈఏసీ ప్రతిపాదనను తిరస్కరించిందని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో అవగింజంతైనా వాస్తవం లేదని ఆయన చెప్పారు.

సుప్రీంకోర్టు కేసుతో ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా ముందుకెళ్లకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గోదావరిలోని అదనపు వరద నీరు ఇప్పటికీ పంచుకోలేదని, ఎలాంటి మళ్లింపైనా రాష్ట్రాల మధ్య సంప్రదింపులతోనే జరగాలని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చిచెప్పారు.