6 June, 2026 | 1:46 AM

నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కోర్టు డ్యూటీ అధికారుల పాత్ర కీలకం

06-06-2026 12:00 AM

ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 5, (విజయక్రాంతి): నిందితులకు శిక్షపడేలా చేయడంలో కోర్టు డ్యూటీ అధికారులు పాత్ర కీలకమని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు  జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, కోర్టు డ్యూటీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కోర్టు డ్యూటీ అధికారులకు కేసుల పట్ల పూర్తి అవగాహన, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కల్పించాలని సూచనలు చేశారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా సమగ్రంగా కేసులను పర్యవేక్షించాలని ఆదేశాలను జారీ చేశారు. సమ్మన్స్, వారెంట్ల జారీలో జాప్యం లేకుండా సకాలంలో సాక్షులకు, నిందితులకు అందజేయాలన్నారు. కోర్టులో విచారణ నడిచే సమయంలో సాక్షులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూసుకోవాలని, సాక్షులకు కేసు వివరాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.

కేసులకు సంబంధించిన సీజ్ చేసిన ప్రాపర్టీని ఎప్పటికప్పుడు కోర్టులో హాజరు పర్చాలన్నారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తమ అధికారులకు తెలియజేస్తూ బాధ్యతాయుతంగా పని చేయన్నారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ, నేరస్తులకు శిక్ష పడే విధంగా కేసుల పరిష్కారంలో కృషి చేస్తూ బాధితులకు న్యాయం చేకూర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కోర్టు లైజరింగ్ ఆఫీసర్, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.