calender_icon.png 6 December, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వేచ్ఛగా ఓటింగ్ లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానం

06-12-2025 05:31:38 PM

ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్ తో కలిసి హాజరై మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు ముందు, పోలింగ్ ముగిసిన తర్వాత నిశితంగా పరిశీలించి, ఎన్నికలు జరిగిన తీరును పర్యవేక్షించి, అట్టి నివేదికను ఎన్నికల సాధారణ పరిశీలకులకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. 

మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ సరళినీ, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, వారి విధులను పటిష్టంగా నిర్వహిస్తునే పోలింగ్ టీంలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందా లేదా, ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎన్నికల నియమావళి అమలు, తదితర విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే  సాధారణ పరిశీలకుల దృష్టికి వెంటనే తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీపీఓ షరీఫుద్దిన్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎల్డీఎం మల్లికార్జున రావు, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.