calender_icon.png 6 December, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి ఈశ్వర చారికి నివాళులు అర్పించిన బీసీ జేఏసీ నాయకులు

06-12-2025 05:38:48 PM

సాయి ఈశ్వర చారి ప్రాణ త్యాగం వృధా కాదు

బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్

హనుమకొండ (విజయక్రాంతి): నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీసీల ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి ప్రాణ త్యాగంతో సాధించుకున్న తెలంగాణలో రెడ్లు, వెలమలు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కబ్జా చేసి, రాష్ట్రంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలను రాజకీయంగా అణిచివేస్తున్నారని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్, దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీలు బీసీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారనే ఆవేదనతో మనస్థాపం చెందిన బీసీల ముద్దుబిడ్డ సాయి ఈశ్వరచారి నేడు ఆత్మ బలిదానం చేసుకున్నాడని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేసారు.

బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం హనుమకొండ జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ టైలర్ స్ట్రీట్ లో దివంగత సాయి ఈశ్వర చారికి నివాళులు అర్పించారు. ముందుగా సాయి ఈశ్వర చారి చిత్రపటానికి పూల మాలలు వేసి, మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించి వారి ఆశయ సాధన కోసం బీసీలందరు ప్రభుత్వలపైన పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వడ్లకొండ వేణుగోపాల్ మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి మృతికి కాంగ్రెస్, బిజెపి పార్టీలే నైతిక బాధ్యత వహించాలన్నారు. ఇది ముమ్మాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హత్యగానే బీసీ సమాజం పరిగణిస్తుందన్నారు.

ఈ హత్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సాయి ఈశ్వరాచారి మృతితోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగం ద్వారా 9వ, షెడ్యూల్లో నేర్పించి, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింప చేయాలన్నారు. తక్షణమే సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయకుంటే, బీసీ ద్రోహుల పార్టీలైన కాంగ్రెస్, బిజెపి నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సాయి ఈశ్వరాచారి ఆత్మ త్యాగంతోనైనా కాంగ్రెస్, బిజెపి పార్టీలలోని బీసీ నేతలంతా రాజీనామా చేయాలని కోరారు.

బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ బోనగాని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి మృతి పై అఖిలపక్ష పార్టీల వైఖరిని ప్రకటించాలన్నారు. బీసీ సమాజానికి రిజర్వేషన్లను కల్పించడం కోసం ఆత్మహుతి చేసుకున్న సాయి ఈశ్వరాచారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణకార సంఘ ఉపాధ్యక్షలు కొత్తగట్టు వీరబ్రహ్మచారి, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెందోట చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, కటుకోజ్వల సత్యనారాయణ, జక్కోజు కోటేశ్వర్ రావు, స్వర్ణకార సంఘం నాయకులు, కార్యకర్తలు పానుగంటి రవీందర్, ఆసం రవి, మధు, శ్రీను, శ్రీధర్, మనోజ్ కుమార్, శ్రీనివాస్, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.