calender_icon.png 19 February, 2026 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తగతం

18-02-2026 12:15:45 AM

ఏడు మున్సిపాలిటీలు అధికార పార్టీ ఖాతాలోకే.. 

  1. ఇంద్రేశంలో బీఆర్‌ఎస్ విజయం 
  2. వాయిదా పడిన 11 మున్సిపాటీల్లో 8 చోట్ల ఎన్నికలు 
  3. మూడు మున్సిపాలిటీల ఎన్నిక మళ్లీ వాయిదా 
  4. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు సమాన ఓట్లు 
  5. లాటరీ తీయగా రెండింటిలోనూ కాంగ్రెస్‌ను వరించిన విజయం
  6. బీజేపీ మద్దతుతో కాగజ్‌నగర్‌ను కైవసం చేసుకున్న కాంగ్రెస్ 
  7. ఎంఐఎం, స్వంత్రంత్రుల సపోర్టుతో జహీరాబాద్ కూడా..
  8. ఇల్లందు, డోర్నకల్, సుల్తానాబాద్‌లోనూ అధికార పార్టీ హవా

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): వాయిదా పడిన మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యత ప్రదర్శించింది.  వాయిదా పడిన 11  మున్సిపాలిటీల్లో చైర్మన్, వైఎస్ చైర్మన్ కుర్చీలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. అయితే, పలుచోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పార్టీల నేతలు ఆందోళనకు దిగారు.  ఎన్నికలు  జరగాల్సిన  11 మున్సిపాలిటీల్లో 8చోట్ల ఎన్నికలు నిర్వహించగా, ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక చోట బీఆర్‌ఎస్ పార్టీ గెలిచింది.

మరో మూడు  మున్సిపాలిటీల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో.. లాటరీ తీయగా రెండు సీట్లూ కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. ఇంద్రేశం మున్సిపాలిటీని మాత్రం బీఆర్‌ఎస్ దక్కించుకుంది. చైర్‌పర్సన్‌గా కె.ప్రమీల, వైస్ చైర్మన్‌గా హరీశ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

ఇల్లందు మున్సిపాలిటీ  కాంగ్రెస్ చైర్మన్‌గా దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్‌గా పెండేల రాజు ప్రమాణ స్వీకారం చేశారు. కాగజ్‌నగర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ మద్దతుతో  కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా కాంగ్రెస్‌కు చెందిన షాహిన్‌సుల్తానా ఎన్నికయ్యారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన  కొండేటి రాజకుమారి చైర్‌పర్సన్‌గా మాద లావణ్య  వైఎస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.

సుల్తానాబాద్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. చైర్మన్‌గా బిరుదు కృష్ణ, వైస్  చైర్మన్‌గా  పుష్పలత ఎన్నికయ్యారు. జహీరాబాద్ మున్సిపాలిటీని ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు ఎంఐఎం సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎంపీ సురేష్ షెట్కార్ ఓటు వేశారు. జహీరాబాద్ చైర్మన్‌గా యూనుస్ ఎన్నికయ్యారు. 

క్యాతన్‌పల్లి, ఖానాపూర్, ఇబ్రాహీంపట్నం వాయిదా 

క్యాతన్‌పల్లి, ఖానాపూర్, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీల చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మున్సిపాలిటీల్లో సరైన కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. క్యాతన్‌పల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక్కడ కోరం ఉన్నా చైర్మన్ ఎన్నికను ఎందుకు వాయిదా వేశారని బీఆర్‌ఎస్ నేతలు నిలదీశారు. బీఆర్‌ఎస్, సీపీఐ సభ్యుల బలాన్ని చూసి మంత్రి వివేక్ జీర్ణించుకోలేదని, అందుకే ఎన్నిక వాయిదా వేసేలా కుట్రలు చేశారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. 

సజావుగా జరపాల్సిన ఎన్నికలను ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేశారని విమర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోనూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ఎన్నికలు వాయిదా పడ్డాయి. రెండో రోజు కోరం లేకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఎస్‌ఈసీ వాయిదా వేసింది. ఎన్నికపై హైకోర్టు నుంచి స్టే రావడంతో అధికారులు వాయిదా వేశారు. 19 వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అపహరణకు గురయ్యాడని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కౌన్సిలర్ యాదగిరి కుమారుడు కిడ్నాప్‌పై హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఎల్లుండిలోపు యాదగిరిని తమ ఎదుట హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అనూహ్యంగా ఉదయం బీఆర్‌ఎస్ క్యాంపులో కౌన్సిల్ ఎన్నికకు యాదగిరి హాజరయ్యారు. చైర్మన్  ఎన్నిక పూర్తయిన తర్వాత అధికారులకు కోర్టు ఆదేశాలు అందాయి. స్టే కారణంగా బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేశాయి.

ఎన్నికల కోడ్ ఎత్తివేత 

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల చైర్మన్లు, మేయర్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది. జనవరి 27న మున్సిపల్, కార్పోరేషన్ల ఎన్నికలకు షెడ్యుల్ విడుదలైనప్పటి నుంచి  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లో ఉన్న సమయంలో కొత్త పథకాల ప్రకటనలు, బదిలీలు, ప్రభుత్వ ప్రచారాలపై ఆంక్షలు కొనసాగాయి. ఇప్పుడు కోడ్ ఎత్తివేయడంతో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పరిపాలన పరమైన నిర్ణయాలు, బదిలీల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానున్నాయి.