8 July, 2026 | 12:53 AM

చిన్నారుల భద్రతే పోలీసుల లక్ష్యం

08-07-2026 12:07 AM

గుడ్ టచ్, బ్యాడ్ ట్ప విద్యార్థులకు అవగాహన

మహబూబాబాద్, జూలై 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో షీ టీం, భరోసా సెంటర్, ఏహెచ్టీయూ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీమ్ ఎస్ ఐ సునంద  మాట్లాడుతూ చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాను పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అసౌకర్యంగా అనిపించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవభావంతో ఉండాలని, క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.

అలాగే సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా షీ టీం, భరోసా సెంటర్ లేదా పోలీసులను వెంటనే సంప్రదించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ షీ టీం హెల్ప్లైన్ 8712656935, అత్యవసర సేవల నంబర్లు 100/112, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930, చైల్ హెల్ప్లైన్ 1098, మహిళల హెల్ప్లైన్ 181/1091 సేవల గురించి విద్యార్థులకు వివరించారు.