వలస కూలీల భద్రత యజమానులదే
- పెద్దపలి ఏసీపీ కృష్ణయాదవ్
- రైస్‌మిల్లులు, ఇటుక బట్టీల నిర్వాహకులతో సమావేశం
పెద్దపల్లి (మంథని) జూన్17(విజయక్రాంతి): ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే కూలీల భద్రత యజమానులదేనని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్ అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని 110 రైస్‌మిల్లులు, 23 ఇటుక బట్టీల అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంతో ఏసీపీ మాట్లాడారు. పొట్టకుటి కోసం కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తుంటారని వారి పట్ల యజమానులు అప్రత్తంగా ఉండాలని సూచించారు.
మూడు రోజుల క్రితం జరిగిన చిన్నారి హత్యాచారం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైస్‌మిల్లులు, ఇటుక బట్టీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వలస వచ్చే కూలీల వివరాలు నమోదు చేసి, రిజిస్టర్‌ను కొనసాగించాలని సూచించారు. మగవారికి, మహిళలకు వేర్వేరుగా నివాసల ప్రాంతాలను ఏర్పాటు చేయాలని, కుటుంబ సభ్యులతో ఉండే కూలీలకు వేరుగా ఉంచాలని ఆదేశించారు.
ఇటుక బట్టీల వద్ద సెక్యూరిటీ గార్డ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తమ తనిఖీల్లో ఇలా లేకుంటే కేసులు నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.






