ఉత్తిపోతలకు కొత్తపూతలు!
- పునరుద్ధరణ దిశగా అమీరాబాద్ ఎత్తిపోతల ప్రాజెక్టు
వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు
త్వరలో పరిశీలించనున్న జిల్లా ఉన్నతాధికారులు
ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
జహీరాబాద్, జూన్ 1౭: కోట్లాది రూపాయలను ఖర్చుచేసి ఏర్పాటు చేసిన సంగా రెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం అమీరాబాద్ ఎత్తిపోతల పథకం అలంకారప్రా యంగా మారింది. పొలాలకు సాగుకు నీరు అందిస్తే పంటలు బాగా పండించుకోవాలని దశాబ్దా కాలంగా ఎంతో ఆశతో రైతు లు ఎదురుచూస్తున్నారు. పుల్కల్ మండలంలో దాదాపు 35 సంవత్సరాల క్రితం సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా మండలంలోని మంజీర నది తీర ప్రాంతంలో వేలాది ఎకరాలు నీట మునిగాయి. దీంతో ముంపునకు గురైన గ్రామాల్లో ఉపాధిలేక, పంటలు పండే వీలులేక కూలీలు, రైతులు రోడ్డున పడ్డారు.
మిగిలిన భూముల్లో పంటలను పండించాలంటే వర్షాధారం పైనే అధారపడాల్సిన పరిస్థితి ఉందని సంబంధింత అధికారులు, ప్రజాప్రతినిధులకు రైతులు మొరపెట్టుకున్నారు. మంజీర నది తీరంలోని అమీరాబాద్ గ్రామ శివారులో నాబార్డు పథకం కింద 2002 సంవత్సరంలో రూ.88.608 లక్షలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ పథకం కింద 500 ఎకరాల ఆయకట్టును నిర్ధేశించారు. కానీ నేటికి ఎత్తిపోతల ద్వారా ఒక్క ఎకరానికి చుక్కనీరు అందించిన దాఖలాలు లేవు.
ఒక సమయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే జే గీతారెడ్డి మంత్రిగా ఉన్న హయాంలో ప్రాజెక్టు విషయాన్ని ఆమెకు వివరించారు. పైపులైను పనులు, ఇతర మరమ్మతుల కోసం రూ. 50 లక్షలు మంజూరు చేయించారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రా క్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. పైపులైన్ల లీకేజీలతో ఒక్క ఎకరం కూడా తడవలేదు.
పునరుద్ధరణకు చర్యలు?
దశాబ్దాకాలంగా నిరుయోగంగా ఉన్న అమీరా బాద్ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవల జహీరాబాద్ డివిజన్ నీటిపారుదల శాఖాధికారులు ఈ ప్రాజెక్టును సందర్శించారనే సమాచారంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. తాజా గా ప్రాజెక్టు పరిసరాల్లో పెరిగిన చెట్లు, చెత్తాచెదారాన్ని తొలగించడంతో రైతుల కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతోంది. త్వరలోనే ఉన్నతాధికారులు సైతం ప్రాజెక్టును పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించ నున్నట్లు తెలుస్తోంది.






