18 May, 2026 | 5:22 AM

నాటి నుంచి నేటి వరకు అదే జోష్

18-05-2026 12:00 AM
  1. కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన చారిత్రాత్మకం 
  2. ధన, జన, రాజకీయ బలగం లేకున్నా జనం పోటెత్తారు
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి) : చారిత్రాత్మక కరీంనగర్ కేసీఆర్ సింహగర్జనకు 25 ఏళ్లు.. సరిగ్గా ఇదే రోజు మే 17, 2001న నిర్వహించిన సింహగర్జన నుంచి నిన్నటి రజతోత్సవ సభ వరకు టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ది అదే జోష్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో సింహగర్జన సభ జరిగి ఆదివారం నాటికి 25 ఏళ్లు పూర్తయిన సందర ్భం గా ఆదివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. 

కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే.. గత కాలపు గాయాలు, వెన్నాడే వైఫల్యాలు.. ఆ వెంటే అపనమ్మకాలు.. ఇదీ కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి. ధన బలం లేదు.. రాజకీయ బలగం పెద్దగా లేదు.. అయినా సభా స్థలికి జనం పోటెత్తారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తనను కన్నభూమి తెలంగాణ ఎందుకిలా గోస పడుతుందన్న ఆవేదన, మాతృభూమిపై గుండెల నిండా పొంగే తెలంగాణ ప్రేమ, రాష్ట్రాన్ని సాధించాలన్న నిండైన పట్టుదల, ప్రజలు అండగా ఉన్నారన్న భరోసా.. ఈ నాలుగే ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను నడిపించిన నాలుగు రథ చక్రాలు’ అని గుర్తు చేసుకున్నారు.