15-12-2025 12:35:05 AM
నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ 76.71 శాతం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, వినయ్ కృష్ణారెడ్డి అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్
నిజామాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 20.49 శాతం పోలింగ్ నమోదయ్యింది.
11 గంటల సమయానికి 49.13 శాతం ఓటింగ్ జరిగిందని అధికారులు ప్రకటించారు. కాగా మధ్యాహ్నం పోలింగ్ పూర్తి సమయానికి రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో తుది పోలింగ్ 76.71 శాతంగా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మోపాల్ మండల కేంద్రంతో పాటు డిచ్పల్లి మండలం ముల్లంగి, ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ లు, మెడికల్ క్యాంపు, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని తనిఖీ చేశారు.
వృద్దులను తరలించేందుకు వీల్ చైర్లు వినియోగిస్తున్నారా, లేదా అని గమనించారు. కలెక్టర్ పర్యవేక్షణలో నిజామాబాద్ డివిజన్ లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్ లోని జక్రాన్పల్లి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు సజావుగా ఎన్నికలు జరిగాయి. రెండవ విడతలో మొత్తం 196 సర్పంచ్ స్థానాలకు గాను నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికే 38 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, మిగతా 158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
అదేవిధంగా మొత్తం వార్డు స్థానాలు 1760 ఉండగా, 5 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదని, 674 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, 1081 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగిందని, 1476 పోలింగ్ కేంద్రాల పరిధిలోనూ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు.
చలి తీవ్రత వల్ల మొదటి రెండు గంటల వరకు ఒక మోస్తరుగా సాగిన ఓటింగ్, అనంతరం వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల సమయానికి 49.13 శాతం ఓటింగ్ నమోదయ్యింది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలలో అవగాహనను పెంపొందించడం, ఫొటోలతో కూడిన ఓటరు స్లిప్పులను ఇంటింటికి తిరిగి ముందస్తుగానే పంపిణీ చేయడం, పోలింగ్ కేంద్రాలలో బీ.ఎల్.ఓలతో కూడిన హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఓటర్లకు సహకరించడం వల్ల పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, వెబ్ క్యాస్టింగ్ జరిపించామని, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేశారని అన్నారు. కలెక్టరేట్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగిందన్నారు.
మద్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా, నిర్ణీత సమయం లోపు క్యూ లైన్లలో నిలుచున్న వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. అనంతరం మద్యాహ్నం 2.00 గంటల నుండి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించేలా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టారు. కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న తప్పిదానికి సైతం తావులేకుండా జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
కాగా, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శిస్తూ ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలన జరిపారు. మోపాల్, మాక్లూర్, గుండారం, డిచ్ పల్లి మండలం ఘన్ పూర్, ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి, సిరికొండ తదితర చోట్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నిజామాబాద్ డివిజన్‌లోని మొగుపాల్, డిచిపల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీపీ..
నిజామాబాద్ డిసెంబర్ 14 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లాలో ఆదివారం జరిగిన రెండవ విడత ఎన్నికలలో భాగంగా మొగుపాల్ , డిచ్ పల్లి మండలంల కేంద్రం లోని కంజర, కులాస్పూర్ , ఘన్పూర్ , ధర్మారం (బి) గ్రామాలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రoల తోపాటు సిరికొండ ధర్పల్లి తదితర ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లను గుర్ నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సందర్శించారు.
పోలీస్ సందర్భంగా నిజామాబాద్ రూరల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు , భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని , సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిపి ఆదేశించారు.
ప్రజలు శాంతి యూత వాతావరణం లో తమ ఓటు హక్కు ను సధ్వినియోగం పర్చుకోవాలని సాయి చైతన్య ప్రజలకు పిలుపు నీచ్చారు. ధర్పల్లి సిరికొండ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను కమీషనర్ సాయిచైతన్య సందర్శించారు.
పోలీస్ సందర్భంగా నిజామాబాద్ రూరల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు , భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా నిజామాబాద్ ఏ.సి.పి రాజా వెంకటరెడ్డి, సీఐ చందర్ రాథోడ్ ఎస్త్స్రలు మహేష్ ఆరిఫ్ సుమలత , ఆర్వో అధికారులు శ్రీనివాస్ , షేక్ మస్జీద్ , రాజ నరసయ్య , మధుసూదన్ అధికారులు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 14 (విజయ క్రాంతి):ఓటర్లు ఎలాంటి భయాందోళన చెందకుండా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ విట్టల్ సూచించారు.ఆదివారం మండలంలో జరుగుతున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని జలాల్పూర్, తాండూర్,నాగిరెడ్డిపేట,మాల్ తుమ్మెద,బొల్లారం గ్రామాలలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ సక్రమంగా పర్యవేక్షించాలన్నారు.పోలింగ్ కేంద్రాలలో భద్రత ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది విధులు, ఓటరు కల్పించడం సౌకర్యాలపై వారు అధికారులతో సమీక్షించారు.ఇలాంటి ఆలోచనలు సంఘటనలు చోటుచేసుకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు పూర్తయి ఫలితాల వెల్లడి ముగిసే వరకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రత చర్యలు కొనసాగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్,తాసిల్దార్ శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, డిప్యూటీ ఎమ్మార్వో రాజేశ్వర్ ఉన్నారు.
చలిలో చంటి పిల్లలతో ఓటింగ్‌కు..
ఎల్లారెడ్డి, డిసెంబర్ 14(విజయ క్రాంతి) :కామారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే చలి కారణంగా ఓటర్లు మందకొడిగా బయటకు వస్తున్నారు. చిన్న గ్రామపంచాయతీల్లో చంటి పిల్లలతో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 9 గంటల వరకు 25 శాతం పోలింగ్ పోలింగ్ నమోదైంది.
ఎండ వేడి పెరగడంతో ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఓటు వేయడానికి క్యూ కడుతున్నారు. మరోవైపు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు అనేక పాట్లు పడుతున్నారు. వలస ఓటర్లు సైతం టూరిస్ట్ వాహనాల్లో తీసుకొస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ జరగనుండడంతో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు స్థానికంగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు ఓటర్లను త్వరగా వెళ్లి ఓటు వేయాలని కోరుతున్నారు.
పోలింగ్ కేంద్రాలను ఎల్లారెడ్డి డీఎల్పివో సురేందర్, డీఎస్పీ శ్రీనివాసరావు, తహశీల్దార్ ప్రేమ్, పరిశీలిస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పోలింగ్ కేంద్రం మద్ద సైతం ఎలాంటి ఆందోళనలు జరగకుండా భారీ బందోబస్తు చేపట్టినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ తెలిపారు. లక్ష్మాపూర్ పోలింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన రెండో విడత పోలింగ్
నిజామాబాద్, డిసెంబర్ 14 :(విజయ క్రాంతి) నిజామాబాద్ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మోపాల్, ముల్లంగి, ధర్మారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం మోపాల్, మాక్లూర్, గుండారం తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఎల్లారెడ్డి డివిజన్‌లో ప్రశాంతం..
ఎల్లారెడ్డి, డిసెంబర్ 14 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు ఆదివారం ఉదయం 7 గంటలకు తీవ్ర చలి కారణంగా మందకోడిగా ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
గాంధారి మండలంలో 72.23%, లింగంపేట్ మండలంలో 82 పాయింట్ 20 శాతం, నాగిరెడ్డిపేట మండలంలో 85.88 శాతం, ఎల్లారెడ్డి మండలంలో 87. 81%శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును స్వచ్ఛగా వినియోగించుకున్న ఓటర్లను అధికారులు అభినందించారు.
నాగిరెడ్డిపేట్ మండలంలో...
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 14 (విజయ క్రాంతి): రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో నూతనంగా ఏర్పాటైన చిన్న ఆత్మకూర్,కన్నారెడ్డి గ్రామ పంచాయతీలలో ఆదివారం పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది.చిన్న ఆత్మకూర్ గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డుకు చెందిన పోలింగ్ బూత్లో మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మొదటగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన సతీమణి పవిత్ర,కుమారులు సచిత్ రెడ్డి, నిచిత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ&చిన్న ఆత్మకూర్ గ్రామంలో నాలుగో వార్డులో మొత్తం 74 ఓట్లు ఉన్నాయని, lవందకు వంద శాతం పోలింగ్ జరిగేలా ప్రతి ఓటరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని,ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని,ఎన్నికల ద్వారా సరైన ప్రతినిధులను ఎన్నుకుంటేనే పల్లెల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టగా,ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు అలాగే నాగిరెడ్డిపేట గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ భారత్ గ్యాస్ ప్రోప్రేటర్ విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.