ప్రాణం తీసిన సెల్ఫీ మోజు
- ఎల్‌ఎండీలో నీటమునిగి ప్రభుత్వ ఉద్యోగి మృతి
- బిడ్డలను రక్షించబోయి అనంతలోకాలకు తండ్రి
కరీంనగర్, జూన్ 17(విజయక్రాంతి): బిడ్డల సెల్ఫీ మోజు తండ్రి ప్రాణం తీసింది. ఎల్‌ఎండీ వద్ద వారు సెల్ఫీ తీసుకుంటూ నీటిలో జారి పడడంతో వారిని రక్షించబోయి తండ్రి మృతిచెందిన సంఘటన సోమవారం కరీంనగర్‌లో జరిగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పే అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న బంగారు విజయ్ కరీంనగర్‌లోని రాంనగర్‌లో నివా సం ఉంటున్నాడు. సోమవారం సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి హుస్నాబాద్ సమీపంలోని పొట్లపల్లి స్వయంభు రాజేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీని సందర్శించారు.
విజయ్ కూతురు సాయినిత్య, కుమారుడు విక్రాంత్ సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు జారి ఎల్‌ఎండీ నీటిలో పడిపోయారు. గమనించిన తండ్రి వారిని కాపాడబోయి నీటిలో దూకాడు. చేపల వేటకు వచ్చిన జాలరులు గమనించి సాయినిత్య, విక్రాంత్‌లను కాపాడారు. విజయ్‌ను కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మృతిచెందాడు. విజయ్ కూతురు సాయినిత్య బీటెక్ చదువుతుండగా, విక్రాంత్ పదవ తరగతి చదువుతు న్నాడు. తమను రక్షించబోయి తండ్రి చనిపోవడంతో బోరున విలపించిన తీరు అందరినీ కలిచి వేసింది. మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పిల్లలను కాపాడిన జాలరి శంకర్‌ను అభినందించారు.






