6 July, 2026 | 3:13 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

‘పోలాల అమావాస్య’ కథ

30-08-2024 12:20 AM

శ్రావణ బహుళ అమావాస్యనే ‘పోలాల అమావాస్య’గా జరుపుకుంటాం. సౌభాగ్యవంతులైన స్త్రీలు ప్రత్యేకించి తమ పిల్లల సంరక్షణ కోసం పోచమ్మను ఆరాధించే వ్రతంగా దీనిని చెబుతారు. ఆ రోజు ముత్తయిదువలను ఇంటికి ఆహ్వానించి వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ సందర్భంగా వారు చెప్పుకొనే పౌరాణిక కథ ఇది.

పూర్వకాలంలో ఒక ఊళ్లో ఒక బ్రాహ్మణమ్మ ఉండేది. ఆమె కు ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టడం తర్వాత నాలుగైదు నెలలకే వారంతా చనిపోవడం జరుగుతూ ఉండేది. భరింపరాని దుఃఖంతో ఆమె ఊరి ముందున్న పోచక్క తల్లి దగ్గర గొయ్యి తీసి పిల్లలను పాతి పెట్టసాగింది. అది చూసిన పోచక్క తల్లి చలించి పోతుంది. ఆమె అంటుంది కదా

“ఏమే! పొలాల అమావాస్య దగ్గరకు వస్తున్నది. పాలేర్లు ఎడ్లకు రంగులు, నెమలి ఈకలు కట్టి ప్రదక్షిణం చేస్తారు. గారెలు, పాయసం నైవేద్యం పెడ్తారు. నువ్వెందుకు ఇలా పిల్లలను తెచ్చి బొంద పెడ్తున్నావు?”

దానికి ఆమె సమాధానంగా,  “అమ్మా! ఏం చెప్పాల. పిల్లలు లేని వారు ఈ నోము నోచుకోరు. మా ఇంటికెవ్వరూ పేరంటం రా నని అంటున్నారు” అని బాధపడుతుంది. అప్పుడు ఆ దేవి  “నువు నిశ్చింతగా ఇంటికి వెళ్లు. తలార స్నానం చేసి శుచిగా వంట వండు. నేను పేరంటానికి వస్తాను. ఆ బద్దుల్లో పెరుగు నీ పిల్లలమీద చల్లు. లేస్తారు!”

ఆ బ్రాహ్మణమ్మ పెరుగును పిల్లల దేహాలపై చల్లుతుంది.  “అమ్మా, అమ్మా” అని లేచిన పిల్లలను తీసుకుని ఆమె సంతోషంగా ఇంటికి వెళుతుంది. 

శుచిగా పచ్చళ్లు, కూరలు, గారెలు, పాయసం వండుతుంది. పోచక్క నిజంగానే పెద్ద ముత్తయిదువ వలె వచ్చింది. ఆమెకు భక్తితో భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సాగనంపాలని అనుకునే సరికి చుట్టుపక్కల వాళ్లు వచ్చి పోచక్క తల్లి అని తెలుసుకుని, సాష్టాంగ దండ ప్రమాణం చేస్తారు. “అమ్మా! కలియుగం పుట్టనున్నది. పెరుగనున్నది. ఇదేమి వ్రతం? ఈమె పిల్లలు ఎందుకలా చనిపోయారు?” అని వారు పోచక్క తల్లిని అడుగుతారు.

అప్పుడు పోచక్క తల్లి “శ్రావణ బహుళ అమావాస్యను ‘పొలాల అమావాస్య’ అంటారు. దేశకాల పరిస్థితుల్లో దొరికే పచ్చి కూరగాయలతో వంట చేయాలి. పచ్చి కూరగాయలు, మక్క కంకులు నాకు నైవేద్యం పెట్టాలి. మట్టితో ఆవులు, ఎద్దులు, గొల్ల బాలుణ్ణి చేసి తురాయి (అగ్నిపూలు)తో పూజించాలి. పేరంటాలుకు పచ్చి విస్తట్లో వడ్డించాలి. రెండువైపుల పచ్చళ్లు, తొక్కులు, కూరలు వడ్డించి, ‘అత్త వాయినం, నా వాయినం’ అని ఇవ్వాలి. ఈగలు, దోమలకు పచ్చి ఆకుల్లో ప్రత్యేకంగా వడ్డించాలి.

తొమ్మిది పోగుల దారాన్ని పేరంటాలు చేతికి కట్టి, మనం కట్టించుకోవాలి. ‘కడుపు చల్లన’ అని ఆమె బొడ్డుపై మనం, మన కడుపుపై పేరంటాలుతో పెరుగు చల్లించుకోవాలి. పూర్వజన్మలో ఈమె పిల్లలు ఏడుస్తుంటే పేరంటాలు రాక ముందు, పాయసం, గారెలు పిల్లలకు పెట్టింది. ఆ దోషంతోనే ఇలా జరుగుతున్నది” అంది. పొలాల అమావాస్య రోజు ముత్తయిదువలంతా ఈ కథ విని అక్షింతలు తలపై వేసుకోవాలి. పిల్లల ఆయుష్షుకు భద్రతనిచ్చే పండగగా దీనిని భావిస్తారు. 

- డా. రంగి కమల