తెలంగాణ యువతకు మళ్లీ ధోకా!
టి.చిరంజీవులు :
* ‘నీళు- నిధులు- నియామకాలు’... తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నినాదాలు ఇవి. ‘నియామకాలు’ అనేది లక్షలాది మంది తెలంగాణ యువత జీవితాలతో ముడిపడి ఉన్న అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే భావన ఉద్యమానికి అత్యంత బలమైన పునాది. స్థానికుల ఉద్యోగాలను ఇతర ప్రాంతాలవారు ఆక్రమించుకున్నారనే వాదన తెలంగాణ ఉద్యమాన్ని విశ్వవిద్యాలయాల నుంచి గ్రామాల వరకు తీసుకెళ్లింది.
అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీలు, ఉద్యమ నాయకులు ‘తెలంగాణ వస్తే ఇంటింటికీ ఉద్యోగం వస్తుంది’, ‘ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తాం’, ‘తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాల్లో న్యాయం జరుగుతుంది’ అని హామీలు ఇచ్చారు. వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత ఈ హామీలను నమ్మి ఉద్యమంలో పాల్గొన్నారు.
అనేక మంది తమ విద్యను, ఉద్యోగ అవకాశాలను పక్కనపెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాడారు. తమ జీవితాలను త్యాగం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తయిన ఈ సమయంలో ఒక ప్రశ్న ప్రతి నిరుద్యోగి మనసులో వినిపిస్తోంది. అదేమిటంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాల విషయంలో యువత కలలు ఎంతవరకు నెరవేరాయి?
* తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్‌లో స్వయం ఉపాధి అవకాశాలకు ఎక్కువగా కేటాయింపులు జరిగి, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తారని అందరూ ఆశించారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి అవకాశాలకు పెద్ద ఎత్తున గండికొట్టారు.
తెలంగాణలో 5.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం 1.60 లక్షలు ఉద్యోగాలు భర్తీచేసింది. అలాగే గత రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 65 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కానీ, సుమారు అంతే మంది పదవీ విరమణ చేశారు. ఉద్యమ సమయంలో ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాలేదనే విమర్శ వాస్తవం.
ప్రభుత్వ శాఖల్లో ప్రతి సంవత్సరం పదవీ విరమణల కారణంగా వేలాది పోస్టులు ఖాళీ అవుతున్నప్ప టికీ, వాటిని వెంటనే భర్తీ చేసే వ్యవస్థ ఏర్పడలేదు. నియామక ప్రక్రియల్లో ఆలస్యం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో రాజకీయ దురుద్దేశంతో మెంబర్లుగా అనర్హులను నియమించడం, పరీక్షల వాయిదాలు, పేపర్ లీకేజీలు, న్యాయపరమైన వివాదాలు.. ఇవ న్నీ నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశను కలిగించాయి. మొదటి 11 సంవత్సరాలు ఒక్క గ్రూప్-1 పోస్టు నియామకం కాలేదంటే పాలకులకు నిరుద్యోగులపై ఎంత పట్టింపో అర్థం చేసుకోవచ్చు.
స్థానికులకు ఉపాధి ఎక్కడ?
ఉద్యమం సందర్భంగా ‘తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వారికే’ అనే నినాదం ఎంత బలంగా వినిపించిందో అందరికీ గుర్తుంది. అయితే, ఇప్పటికీ ప్రాంతేతరులకే నామినేటెడ్ పదవుల నుంచి అనేక ప్రభుత్వ పోస్టుల వరకు పెద్ద పీట వేసి స్థానికుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. స్థానిక ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం తీసుకొచ్చామని ప్రభుత్వాలు చెప్పుకొన్నాయి. కానీ, మరోవైపు ఖాళీ పోస్టులే భర్తీ కాకపోతే, రిజర్వేషన్ చట్టాలు కేవలం కాగితాల మీద ఉండిపోతే యువతకు ప్రయోజనం ఏమి టి? ఉద్యోగాల భర్తీ లేకపోతే రిజర్వేషన్ కూడా అవకాశంగా మారదు.
తెలంగాణలో సామాజిక న్యాయం నిజం గా అమలు కావాలంటే కొన్ని కీలకమైన విధానపరమైన సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలి. గ్రూప్-1 ఎంపికలకు సంబంధించిన జీవో 29 బడు గు, బలహీన వర్గాల అభ్యర్థులకు అన్యా యం చేస్తోందనే అభిప్రాయంతో పెద్ద ఎత్తు న నిరసనలు జరిగాయి. అలాగే పోలీసు నియామకాలకు సంబంధించిన జీవో 46 తెలంగాణ ప్రాంత యువతకు అన్యాయం చేస్తోందని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ రెండు అంశాలు ఉపాధి అవకాశాల్లో సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తాయి. అలాగే పోటీ పరీక్షలకు వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. మరోవైపు, తెలంగాణలో అనేక పరిశ్రమలు స్థాపిస్తున్నప్పటికీ, స్థానిక యువతకు ప్రైవేట్ పరిశ్రమల్లో తగిన ఉపాధి అవకాశాలు లేదా రిజర్వేషన్ వంటి రక్షణలు లేకపోవడం కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశం.
రాష్ట్ర సహజ వనరులు, భూములు, ప్రభు త్వ ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని పరిశ్రమలు ఏర్పడుతున్నప్పుడు, స్థానికులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా సామాజిక బాధ్యతగా పరిగణించాలి. అందువల్ల గ్రూప్--1 నియామకాల విధా నం, పోలీసు నియామకాల నిబంధనలు, స్థానికులకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాల వంటి అంశాలను ప్రభుత్వం సమగ్రంగా పరిష్కరించకుండా తెలంగాణలో సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో సాధ్యమైందని చెప్పలేం. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాకారమవుతుంది.
మరొక పెద్ద దగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచిన నిర్ణయం. ప్రభుత్వం అనుభవజ్ఞుల సేవలను కొనసాగించడానికి ఈ నిర్ణ యం తీసుకున్నామని చెప్పినా, నిరుద్యోగ యువత మాత్రం దీని వల్ల ఉద్యోగాల భర్తీకి తమ దారులు మూసుకుపోయాయని ఆవేదన చెందారు. ఒక పాత సీనియర్ స్థానం లో ఇద్దరు లేదా ముగ్గురు జూనియర్లను నియమించుకునే అవకాశముండేది.
కానీ, రిటైర్మెంట్ వయసు పెంచి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాయిదా వేసి మిగిలిన సొమ్మును నీటిపారుదల ప్రాజెక్టులకు మళ్లించి నిరుద్యోగుల పొట్ట కొట్టి తాము లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప పాలకులకు ఇంకొక ద్యాస లేదు. అలాగే పెద్ద ఎత్తున రిటైర్మెంట్ అయి న ఆధిపత్య కుల అధికారులను మళ్లీ ఉద్యోగాల్లో కొనసాగించి తమ ఆధిపత్య కుల వైఖరిని బయట పెట్టుకుంటున్నారు. మీదు మిక్కిలి ప్రాంతేతరులుకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
ఇది ప్రభుత్వ ఉద్యోగాల సమస్య మాత్ర మే కాదు. ఇది సామాజిక న్యాయం, యువ త భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రశ్న. ఈ సమస్య అత్యంత స్పష్టం గా కనిపిస్తున్న రంగం ఉన్నత విద్య. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్య’ అనే లక్ష్యా న్ని ప్రకటించారు. కానీ, నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి ఆ లక్ష్యానికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.
పన్నెండేళ్లుగా అనేక విశ్వవిద్యాలయాల్లో పెద్దఎత్తున రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరగలేదు. వేలాది ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయి. కానీ, గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్, అవర్‌లీ బేసిస్ అధ్యాపకులతోనే విద్యా వ్యవస్థ కొనసాగుతోంది. పరిశోధన, బోధన, విద్యా నాణ్యత అన్నీ దీనివల్ల ప్రభావితమవుతున్నాయి. విశ్వవిద్యాలయం అంటే కేవ లం భవనాలు కాదు; ప్రతిభావంతులైన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల మ ధ్య జరిగే మేధో సంభాషణ.
అలాంటి సంస్థల్లోనే శాశ్వత అధ్యాపకులు లేకపోతే నాణ్య మైన విద్య ఎలా సాధ్యమవుతుంది? తెలంగాణ ఉద్యమం కలగన్న విద్యా తెలంగాణ ఇదేనా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ర్టంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నా యి. తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం 2018లో తీసుకురాగా, ఇప్పటికే 20 ప్రైవేట్ వర్సిటీలు వచ్చాయి. ప్రభుత్వ రం గంలో 19 వర్సిటీలు ఉంటే, ప్రైవేట్ రంగం లో ఈరోజు 20 వర్సిటీలు వచ్చాయి.
ఈ యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రిజర్వేషన్లు అవసరం లేదు. ఒకవైపు తెలంగాణలో యువత ఉద్యోగాల కోసం కొట్టుమి ట్టాడుతుంటే, ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో ఏర్పడుతున్న ఈ ప్రైవేట్ వర్సిటీలు ఎలాంటి రిజర్వేషన్లు పాటించకుండా తెలంగాణ యు వత అవకాశాలపై తీవ్రమైన దెబ్బకొడుతున్నాయి. నాణ్యమైన ఉన్నత విద్య ధనికులకు మాత్రమే పరిమితం కాకుండా, సాధారణ కుటుంబాల పిల్లలకు కూడా అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ విశ్వవిద్యాల యాల బలోపేతం తప్పనిసరి.
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ నేడు కేవలం ఒక ప్రాంతం కాదు; అది తెలంగాణ నిరుద్యోగ యువత ఆశలు, ఆందోళనలు, ఎదురుచూపులకు ప్రతీకగా మారింది. వేలా ది యువకులు అక్కడ సంవత్సరాల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ తమ జీవితంలోని విలువైన సమయాన్ని గడుపుతు న్నారు. ఒక నోటిఫికేషన్ కోసం, ఒక పరీక్ష కోసం, ఒక ఫలితం కోసం వారి జీవితాలు నిరీక్షణలోనే గడుస్తున్నాయి.
తప్పని గల్ఫ్ బాట
తెలంగాణ వచ్చిన తర్వాతైనా గల్ఫ్ బాటపట్టిన యువతకు ఉపశమనం లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఫలితం లభించలేదు. నేటికీ గ్రామీణ ప్రాంతంలోని బహు జన యువత పొట్టచేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు నైపుణ్యం లేని ఉద్యోగాలకు వెళ్తున్నారు. ప్రభుత్వం వారికి నైపుణ్యాలు పెంచి ఇతర దేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పించడంలో ఎలాంటి చొరవ తీసుకోలేకపోవడంతో వారి జీవితాలు ఎడారి పాలవుతున్నాయి.
ఏ దేశాకైనా యువతే పెట్టుబడి. యువతపై పెట్టుబడి పెట్టని దేశానికి భవిష్యత్తు ఉండదు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. సు మారు 21 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల 55 కోట్ల మంది యువత ఈ దేశానికి అతిపెద్ద సంపద. ప్రకృతి సంపదలు, ఖనిజాలు, భూములు, పరిశ్రమలు ఎంత విలువైనవో, వాటన్నింటికంటే విలువైనది ఒక దేశంలోని యువశక్తి.
ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తును నిర్మించేది భవనాలు కాదు, బడ్జెట్లు కాదు, యువతే. ఆర్థిక శాస్త్రం లో జనాభా లాభం అనే భావన ఉంది. పని చేసే వయస్సులో ఉన్న జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు, వారికి నాణ్యమైన విద్య, నైపుణ్యాలు, ఉద్యోగాలు కల్పించగలిగితే ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ, అదే యువతకు విద్య లేకపోతే, నైపుణ్యాలు లేకపోతే, ఉపాధి అవకాశాలు లేకపోతే, అదే ‘జనాభా విపత్తు’గా మారుతుంది. యువత గురించి ఒక ప్రసిద్ధమైన సామెత ఉంది.
‘ఒక సంవత్సరం లాభం కావాలంటే ధాన్యం పండించు; పది సంవత్సరాల లాభం కావాలంటే తోటలు పెంచు; వంద సంవత్సరాల అభివృద్ధి కావాలంటే యువతపై పెట్టుబడి పెట్టు.’ ఈ భావన నేటికీ శాశ్వత సత్యం. యువతపై పెట్టిన పెట్టుబడి ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, చివరకు ఒక దేశాన్ని మారుస్తుంది.
కానీ, దురదృష్టవశాత్తు, నేడు పాల కులు యువతను దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దడం కంటే, ఎన్నికల రాజకీ యాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ మధ్య జెన్ జీ యువత అద్వ ర్యంలో కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్తంగా చేసిన నిరసనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరచి యువతపై దృష్టిసారించాలి. లేకపోతే యువత ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.
తెలంగాణలో నిరుద్యోగ పరిస్థితి
తెలంగాణ రాష్ర్టం ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిం ది. హైదరాబాద్ ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించింది. అయినప్పటికీ ఈ అభివృద్ధి రాష్ర్టంలోని అన్ని జిల్లాలకు సమానంగా విస్తరించలేదు. భారత ప్రభుత్వం నిర్వహించే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) ప్రకారం.. 2025లో భారతదేశ సగటు నిరుద్యోగ రేటు 3.1 శాతం ఉండగా, తెలంగాణలో అది 5 శాతంగా నమోదైంది.
2026 మే నెలకు సంబంధించిన తాజా నివేదికల ప్రకారం.. తెలంగాణ లో నిరుద్యోగ రేటు 5.6% పెరిగింది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ లో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా ఉందని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ దేశంలోని అధిక నిరుద్యోగం ఉన్న 3వ రాష్ట్రంగా నిలిచింది. నైపుణ్యాల లోపం, విద్యావ్యవస్థలో మార్పు, ప్రభుత్వ చేయూత లేకపోవడం, స్కిల్ యూనివర్సిటీలు, అప్‌గ్రేడ్ చేసిన ఐటీఐలు కాగితాలపైనే కనిపిస్తుండటం దీనికి ప్రధాన కారణాలు.
నైపుణ్యాభివృద్ధి వల్ల యువతకు స్థిరమైన ఉద్యోగాలు లభించిన దాఖలాలు లేవు. నైపు ణ్యాభివృద్ధి పేరిట ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనలో మాత్రం విఫలమ వుతున్నాయి. స్వయం ఉపాధిని ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నప్పటికీ మూలధనం, రుణాలు, సాంకేతిక సహకారం లేకపోవడంతో అది కూడా యువతకు ఒక మిథ్య గానే మిగిలిపోతోంది.
నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటే పరిష్కారం కాదు. ఖాళీ పోస్టు లను క్రమం తప్ప కుండా భర్తీ చేయడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత. అదే సమయంలో భారీస్థాయిలో పరిశ్రమలు, తయారీరంగం, ఎంఎస్‌ఎంఈలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సేవారంగం, స్టార్టప్‌ల ద్వారా ప్రైవేట్ రంగం లో ఉపాధి అవకాశాలను విస్తరించాలి.
బడ్జెట్‌లో కేటాయింపులేవి?
తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్‌లో స్వయం ఉపాధి అవకాశాలకు ఎక్కువగా కేటాయింపులు జరిగి, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తారని అందరూ ఆశించారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి అవకాశాలకు పెద్ద ఎత్తున గండికొట్టారు. బడ్జెట్‌లో భారీ కోత విధించారు. ప్రతి పైసా ఇరిగేషన్ రంగానికి అంటూ యువతను కడగండ్లపాటు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకువచ్చి, రాజీవ్ యువ వికాసం కింద పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి యువతలో నైపుణ్య అభివృద్ధి పెంచి, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికి ఈ రోజుకు రాజీవ్ యువ వికాసం కోసం ఒక్క రూపా యి కూడా విదిల్చలేదు. ఎంఎస్‌ఎంఈ పాలసీలో బీసీలకు రిజర్వేషన్ కూడా పెట్టన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతోంది.
విద్యా వ్యవస్థను కూడా ఉపాధి అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ సంస్థల మధ్య సమన్వయం పెరగాలి. ప్రభుత్వరంగంలో పారదర్శక ని యామకాలు, ప్రైవేట్ రంగంలో నాణ్యమైన ఉపాధి, స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం. ఈ మూడు కలిస్తేనే నిరుద్యోగ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపగలవు. తెలంగాణ ఉద్యమం కేవలం కొత్త రాష్ట్రాన్ని సాధించడం కోసం జరగలేదు.
అది ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, స్థానిక యువత భవిష్యత్తు కోసం జరిగింది. ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థులు, యువత కలలు కన్న తెలంగాణలో ఉద్యోగాల కోసం మరో తరం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వస్తే, అది ఉద్య మ ఆకాంక్షలను దగా చేసినట్టుగానే భావించాలి. ఈ రోజు తెలంగాణలో ఆధిపత్య పాలక కులాలకు నియామకాలు అయ్యా యి. త్యాగాలు చేసిన బహుజనులకు నిరుద్యోగం మిగిలింది.
అందుకే తెలంగాణ ఉద్య మ ఆత్మను నిజంగా గౌరవించాలంటే, ఖాళీ పోస్టులను వేగంగా భర్తీ చేయడం, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం, నాణ్యమైన సామజిక న్యాయంతో కూడిన ప్రైవేట్ ఉపాధిని విస్తరించడం, యువతకి జీవనోపాధి కల్పించడం ప్రభుత్వాల అత్యున్నత ప్రాధాన్యంగా మారాలి. అప్పుడే ‘నియామకాలు’ అనే ఉద్యమ నినాదం పుస్తకాలలోనే కాదు, తెలంగాణ యువత జీవితా ల్లో కూడా సాకారం అవుతుంది.
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్






