ఎండ.. ప్రచండ..
- భగ్గుమంటున్న భానుడు... పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
- ఉక్కబోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి...మరో వారం నిప్పుల కొలిమేనట..
- ఉదయం 11 దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యం..గుమ్మం దాటాలంటే జంకుతున్న జనం...
- ఆస్పత్రులకు వడదెబ్బ బాధితుల తాకిడి..జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న జిల్లా అధికారులు..
బాన్సువాడ, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): ఎండ ప్రచండ గా మారింది.మండుటెండలు వెండిలా మెరుస్తున్నాయి. సూర్యోదయం నుంచే బాణుడు భగ్గుమంటున్నాడు. గ్రీష్మ తాపానికి తట్టుకోలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోతతో అల్లల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, ఎండలు తీవ్రంగా కాస్తుండడంతో జనం గుమ్మం దాటాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం40.0 సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మరో వారం రోజులు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 45 నుండి 50 దాట వచ్చిన కూడా చెబుతోంది. సూర్యోదయం నుండి భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.
ఉదయం 10 దాటిందంటే రోడ్లపై రాకపోకలు నిలిచిపోతున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన కూడల్లు, ఆర్టీసీ బస్టాండ్లు సైతం వెలవెల బోతున్నాయి. ఎండ తాకిడికి తట్టుకోలేక వ్యాపారస్తులు సైతం దుకాణ సముదాయాలను మూసివేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్,కామారెడ్డి జిల్లాలో ఎండల తాకిడి మరింత ఎక్కువగా ఉంది. కామారెడ్డి జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్ దాటినట్లు వాతావరణ శాఖ సూచిస్తుంది.
జాగ్రత్తలు తప్పనిసరి..
ఉష్ణోగ్రతల ప్రభావం ప్రజల మీద పడొద్దు అనుకుంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా అధికారులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు రావాల్సి ఉంటుందని, అకారణ చేత ఎండలో తిరిగి అనారోగ్య బారిన పడవద్దని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు సైతం ఈ విషయంలో పలు సూచనలు సలహాలు అందిస్తున్నారు. గ్రీష్మ తాపాన్ని తట్టుకునేందుకు చలువ చేసే పానీయాలను సేవించాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్త పడాలన్నారు.
నిర్మానుష్యంగా రోడ్లు,ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు..
భానుడి ప్రభావానికి ఉదయం 11 దాటిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. రహదారులన్నీ రాకపోకలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన క్రీడలు సైతం జనం తాకిడి లేక వేలవేల బోతున్నాయి. ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత ఆర్టీసీ ఆదాయం పై కూడా గండి పడింది. ప్రయాణికుల సందడి లేక ఆర్టీసీ బస్సులు ఖాళీగా పరుగులు పెడుతున్నాయి.
ఆసుపత్రులకు వడదెబ్బ బాధితుల తాకిడి..
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వడదెబ్బ బాధితుల తాకిడి మొదలైంది. వడదెబ్బతో తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. వాంతులు విరోచనాలతో మంచాన పడుతున్నారు. ఎండల తాకిడితో కూలీలు సైతం అస్వస్థతకు లోనవుతున్నారు. వ్యవసాయ రైతులు కూడా అపసోపాలు పడుతున్నారు. ఆసుపత్రులకు వచ్చే వడదెబ్బ బాధితులకు వైద్యులు సకాలంలో వైద్య పరీక్షలు చేసి చికిత్సలు అందిస్తున్నారు. పరిస్థితిని చూసి అదుపుతప్పితే జిల్లా కేంద్రాలకు వడదెబ్బ బాధితులను తరలిస్తున్నారు.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..
వేసవి తాపంతో జనం ఇళ్లల్లో కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సామాన్య పేదరిక కుటుంబాల్లో మాత్రం ఇళ్లల్లో ఉండలేక పంట పొలాల్లోని చెట్ల కింద సేద తీరుతున్నారు. ఏసీలు కూలర్లు ఫ్యాన్లు సహాయంతో ప్రజలు కాసింత ఉపశమనం పొందుతున్నారు. అయినప్పటికీ ఎండ పొడ ఇళ్లల్లోకి రావడంతో చిన్నపిల్లలు మహిళలు ఉడకపోతతో అవస్థలు పడుతున్నారు.
శీతల పానీయాలకు భలే గిరాకి..
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు శీతల పానీయాలపై దృష్టి సారిస్తున్నారు. తడారి పోతున్న గొంతును తడుపు కునేందుకు మజ్జిగ, నిమ్మరసం, ఆరెంజ్, చెరుకు రసం, పండ్ల రసాల వైపు పరుగులు పెడుతున్నారు. అదేవిధంగా శీత ల పానీయాల గిరాకి మరింత పెరిగింది. దీంతోపాటు వైన్ షాపు ల్లో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పురుషులు యువత బీర్లను సేవించేందుకు అత్యంత ప్రాధాన్యతని స్తు న్నారు. వేసవి కాలంలో ఎప్పుడు లేనంతగా బీర్లు అమ్మకాలు పెరిగినట్లు లిక్కర్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
బీర్ల అమ్మకాలు పెరగడంతో నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుంది అని కూడా చెబుతున్నారు.చెట్ల కింద సేద తీరుతున్నారు. ఏసీలు కూలర్లు ఫ్యాన్లు సహాయంతో ప్రజలు కాసింత ఉపశమనం పొందుతున్నారు. ఎండ పొడ ఇళ్లల్లోకి రావడంతో చిన్నపిల్లలు మహిళలు ఉడకపోతతో అవస్థలు పడుతున్నారు.






