నకిలీ బిల్లులతో రూ.72 లక్షలు స్వాహా!
అభివృద్ధి పేరిట ప్రజాదరణ దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు
జిల్లా పంచాయతీ అధికారి విచారణ
తగు చర్యలు తీసుకోవాలని పలివెల గ్రామస్తుల వేడుకోలు
మునుగోడు, ఏప్రిల్ 22: సాధారణంగా గ్రామ అభివృద్ధి అంటే ప్రజలకు మేలు జరిగే పనులు గుర్తుకు వస్తాయి. కానీ అదే అభివృద్ధి పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అయితే ఆ గ్రామంలో కల్లోలం తలెత్తడం సహజం. మునుగోడు మండలంలోని పలివెల గ్రామంలో అలాంటి ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్థుల్లో తీవ్ర చర్చిని అంశంగా మారింది.
గతంలో గ్రామంలో పని చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి, ఓ మాజీ సర్పంచ్ కలిసి ఎలాంటి అంచనాలు లేకుండానే నకిలీ బిల్లులు సృష్టించి సుమారు రూ.72 లక్షల ప్రజాధనాన్ని తమ ఇష్టానుసారం డ్రా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల పేరిట నిధులను వినియోగించాల్సిన వారు అదే నిధులను దుర్వినియోగం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై గ్రామంలో పెద్దఎత్తున చర్చలు సాగుతున్నట్లు తెలుస్తుంది.
జిల్లా పంచాయతీ అధికారి విచారణ:
ఇదే విషయంపై ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు అందగా.. చేసిన విచారణలో కూడా అవకతవకలు జరిగాయనే విషయాలు బయటపడినట్లు సమా చారం. అంతేకాకుండా ఇంటి పన్నులు, నల్ల బిల్లుల పేరుతో కూడా అక్రమ వసూళ్లు జరిపినట్లు ప్రస్తుత పాలకవర్గంలోని కొందరు ఆరోపిస్తున్నారు.
గత నెల 31న మాజీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ& ఇప్పటివరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, ఇంకా ఆమెపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని గ్రామస్థులు ప్రశ్నించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాధ్యత గల అధికారులే చర్యలు తీసుకోకపోతే& అవినీతినీ ఎలా రూపుమాపవచ్చనే అభిప్రాయాలు గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
గ్రామ అభివృద్ధి పేరుతో జరిగిన ఈ తంతుపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని గ్రామస్థులు ఎదిరి చూస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ విషయానికి చరమగీతం పాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రజాధనం దుర్వినియోగం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి
- జిల్లా పంచాయతీ అధికారి చేపట్టిన విచారణలో పూర్తి విషయం బయటపడింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదు. ఇప్పటికైనా అధికారులు ఆ విచారణలో తేలిన విషయాలను అనుసరించి ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఆనగంటి కృష్ణ, మూడో వార్డు మెంబర్, పలివెల






