calender_icon.png 4 May, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తెలంగాణ ఉద్యమం నన్ను తీర్చిదిద్దింది

04-05-2025 12:19:46 AM

విద్యార్థుల రక్తం చిందనిపోరే లేదు.. విద్యార్థుల త్యాగం రాయని చరితే లేదు.. ఇది చరిత్ర లిఖించిన సత్యం. ఎంతో మంది విద్యార్థి యువకిషోరాలు రక్తం చిందిస్తే.. ప్రాణాలు అర్పిస్తే నే తెలంగాణ కల సాకారమైంది. స్వరాష్ట్ర కల సాకారమై దశాబ్దం గడిచింది. కానీ.. ఉద్యమకారుల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు.

‘ఎవడిపాలయ్యరో తెలంగాణ’ అన్నట్లు దొరలు రాజ్యం ఏలుతుంటే.. ఆ ఉద్యమానికి ఊపిరు లూదిన వారు మాత్రం  ఉసూరుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇకనైనా తమ బతుకులు మారవా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఉద్యమకారుల్లో  కొత్తగూడేనికి చెందిన బాలకృష్ణ ఒకరు. ఉద్యమ సమయంలో తన జ్ఞాపకాలను ‘విజయక్రాంతి’తో పంచుకున్నారు.

మీ కుటుంబ నేపథ్యమేంటి? 

మాది ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని హనుమాన్ బస్తీ. మా ప్రాంతం సింగరేణి పరిధిలోకి వస్తుంది. నాన్న సింగరేణి కార్మికుడు. నాన్నకు కొత్తగూడెం బదిలీ కావడంతో నా చిన్నతనంలోనే అక్కడే స్థిరపడ్డాం. మాకు రాజకీయ నేపథ్యమేమీ లేదు. 

మరి రాజకీయాలవైపు ఎలా మళ్లారు?

కొత్తగూడెం కమ్యూనిస్టు ఉద్యమాలు, విప్లవ రాజకీయాలకు పెట్టింది పేరు. కోల్ బెల్డ్  కార్మిక ఉద్యమాలకు నెలవు. ఇక్కడి రాజకీయ పరిస్థితులు సహజంగానే నాపై ప్రభావం చూపాయి. అలాంటి దశలో నాకు కోట శివశంకర్ అనే ఏఐఎస్‌ఎఫ్ లీడర్ పరిచయమయ్యాడు.  సీపీఐ విద్యార్థి సంఘంలో ఆయన జిల్లా స్థాయి నాయకుడు. ఆయన పరిచయంతో నేను విద్యార్థి సంఘాల వైపు ఆకర్షితుడిని అయ్యా. రాజకీయాల్లోకి వచ్చా. నాటి సీపీఐ లీడర్ జలాల్  ప్రభావం కూడా నాపై ఉంది. 

కేవలం వ్యక్తుల ప్రభావంతోనే రాజకీయాలకు ఆకర్షితులయ్యారా?

అలా అని కాదు గానీ.. కొంతమేరకు వాళ్ల ప్ర భావం నామీద ఉంది. విద్యార్థి సంఘం నేతగా నేను అనేక రాజకీయ శిక్షణ తరగతులకు హాజర య్యా. ఆ తరగతులు నాకు ప్రపంచ జ్ఞానాన్ని పరి చయం చేశాయి. తరగతులు నన్ను రాజకీయాల మళ్లించాయి. ఆ సమయంలో నాకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు స్టాలిన్‌తో పరిచయం ఏర్పడింది.  స్టాలిన్‌తో తరచూ రాజకీయా లు, ఉద్యమాల గురించి చర్చించే వాడిని. 

తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి?

నేను పాలిటెక్నిక్ చదువుకుతున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెతున్న జరుగుతున్నది. ఆ సమయంలో నేను ఏఐఎస్‌ఎఫ్  విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో మా సంఘం కూడా కీలక పోషించింది. సంఘ బాధ్యుడిగా నేను తెలంగాణ జేఏసీ, విద్యార్థి జేఏసీ ఇచ్చిన అన్ని పిలుపును అందుకుని, నా కింది కేడర్‌ను నడిపించేవాడిని. నేను మిలిటెంట్‌గా ఉద్యమంలో పనిచేశా. 

ప్రత్యేకమైన సందర్భాలు ఏమైనా చెప్పగలరా?

తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ ఉస్మానియా యూనివర్సిటీ.. అని మనం ఎలా చెప్పుకొంటామో కొత్తగూడెం కేంద్రంగా జరిగే తెలంగాణ ఉద్యమానికి మా రుద్రంపూర్ పాలిటెక్నిక్ కాలేజీ గుండెకాయ అనుకోవచ్చు. కాలేజీలో చదువుతున్నపపుడు మా కాలేజీ విద్యార్థులు తెలంగాణ సాధన కోసం రోజుకో కార్యక్రమం నిర్వహించే వాళ్లు. కాలేజీ ఎదుట సుమారు నెల రోజుల పాటు రిలే నిరహార దీక్షలు నిర్వహించాం. అంత ఉధృతంగా దీక్షలు మరే ఇతర కాలేజీలో నిర్వహించి ఉండకపోవచ్చు. 

మీపై రౌడీషీట్ ఉంది కదా.. అది ఎలా జరిగింది?

నాపై పోలీసులు రౌడీషీట్ తెరిచిన మాట వాస్త వమే. మా సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా మేం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. నేను మరింత ఉధృతంగా ఉద్యమానికి ప్రాతినిథ్యం వహించా. ఉద్యమ సమయంలో నేను అనేక సార్లు అరెస్టయ్యా.నాలాంటి ముఖ్య నాయకులు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసేవాళ్లు.

కానీ నేను మాత్రం పోలీసుల ఎత్తుగడలను పసిగట్టి వాళ్లకు దొరకుండా జాగ్రత్తపడేవాడిని. అనుకున్న కార్యక్రమం అయ్యేవరకు పోలీసులకు కంటిమీద కునుకుండే చేసేవాడిని. ఇది గమనించిన పోలీసులు కొన్నిసార్లు నన్ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించేవారు. ఎస్‌హెచ్‌వోలు అనేకసార్లు మందలించారు. తర్వాత కొన్నిరోజులకు నాపై  కుట్ర పూరితంగా రౌడీషీట్ తెరిచారు.

ఉద్యమకాలంలో జైలు జీవితం అనుభవించారా?

తెలంగాణ ఉద్యమ కాలంలో నేను మూడు సార్లు జెలు జీవితం గడిపాను. అప్పటివరకు మా కుటుంబంలో ఎవరూ జైలుకు వెళ్లలేదు. కనీసం పోలీసు స్టేషన్ మెట్లునా ఎక్కేవారు కాదు. నా విషయానికి వచ్చేసరికి ఆ రెండూ జరిగాయి. నేను జైలుకు వెళ్లానంటే ఇంట్లోవాళ్లు ఆందోళనకు గురవుతారని భావించి.. ఏవో కబుర్లు చెప్తుండే వాడిని ఒకసారరి కాలేజీకి వెళ్లున్నా అని. మరోసారి స్నేహితుల ఇండ్లకు వెళ్లా.. అని అబద్ధం కానీ.. చివరకు ఏదో విధంగా ఇంట్లో తెలిసేది. తెలిసిన తర్వాత నా కుటుంబం బాధ పడేది. నా అరెస్ట్, జైలు జీవితం వారిని కలచివేసింది.

తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాయా అంటే ఏం చెప్తారు ?

ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమమే నన్ను ఉద్యమకారుడిగా తీర్చిదిద్దింది. అందులో అనుమానం లేదు. కానీ.. స్వరాష్ట్రం వచ్చిన తర్వత మా ఆకాంక్షలు నెరవేరలేదు. ఇప్పటికీ ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపులేదు. నిన్నమొన్నటి వరకు మాపై కేసులు ఎత్తివేయలేదు. సంవత్సరాల పాటు కోర్టుల చుట్టు తిరిగాం. ఉద్యమకారులపై ప్రభుత్వం అనేక నిర్బంధాలను ప్రయోగించింది.