6 May, 2026 | 7:01 AM

ముప్పు తప్పింది!

01-08-2025 12:02 AM

రష్యా సమీప పసిఫిక్ మహాసముద్ర గర్భంలో పుట్టుకొచ్చిన భీకరమైన సునామీ సముద్ర తీర దేశాలను చిగురుటాకులా వణికించింది. రష్యా తీర ప్రాంతమైన కమ్చట్కా ద్వీప కల్పంలో సముద్రగర్భ భూకంపం ధాటికి ఉద్భవించిన రాకాసి అలలు తీర పట్టణాలపై విరుచుకుపడ్డాయి. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో మొదలైన భూప్రకంపనలు సమీప దేశాల్లోని కోట్లాది మంది ప్రజలను ప్రాణభయంతో పరుగులు పెట్టించాయి.

ఈ భూకంప కేంద్రం 1,80,000 జనాభా ఉన్న రష్యా నగ రం పెట్రోపావ్‌లోవ్‌స్క్‌కు 119 కిలోమీటర్ల దూరంలో.. 20.7 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది. భూకంపం వల్ల రష్యాతో పాటు అమెరికా, జపాన్, హవాయ్ దీవుల్లో సునామీ వచ్చింది. కమ్చట్కాలో 3 నుంచి 4 మీటర్లతో మొదలైన సునామీ అలలు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. సునామీతో పెద్దగా ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని తెలుస్తోంది.

యంత్రాంగం ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో పసిఫిక్ సముద్ర తీర ప్రాంత దేశాల్లో ఉండే లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అంతేకాదు, అధికారులు పసిఫిక్ తీర ప్రాంతాల వెంబడి ఉన్న 40 దేశాలకు చెందిన పలు బీచ్‌లు, విమానాశ్రయాలు, ఓడ రేవులను ముందస్తుగానే మూసివేయించి, అక్కడ పనిచేస్తున్న వర్కర్లను, స్థానికులను అప్రమత్తం చేశారు.

తాజా భూకంపంతో 2011లో జపాన్‌లో సంభవించిన సునామీ మరోసారి కళ్ల ముందు కదలాడింది. దీంతో అప్రమత్తమైన జపాన్ అధికారులు ఫుకుషిమాలోని అణుకేంద్రా న్ని ముందస్తుగా మూసేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీసీ), ఇతర దేశాల అధికారుల హెచ్చరికలతో పెద్ద ముప్పు తప్పినట్టయింది.

రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతను ఒడిసిపడుతున్న పరిశోధకులు భూకంపాలు, సునామీలు, మహా విపత్తులను ముందే పసిగట్టి నష్టాన్ని కొంతైనా తగ్గించగలుగుతున్నారు. 2020లో గూగుల్ పరిచయం చేసిన ఆండ్రాయిడ్ ఎర్త్ క్వేక్ అలర్ట్ (ఏఈఏ) వ్యవస్థ ఎంతో ప్రయోజనకరంగా వుంది. ప్రాథమిక, ద్వితీయ భూకంప తరంగాలను ఈ వ్యవస్థ గుర్త్తించి, అలర్ట్ చేస్తుండటంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు.

ఏఈఏ సిస్టమ్ ఇప్పటివరకు 98 దేశాల్లో భూకంప ప్రభావిత ప్రాంతా ల్లో నివసించే ప్రజలకు హెచ్చరికలను పంపడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. భూకంపం వచ్చే కొన్ని నిమిషాల ముందు యూజర్లకు ఏఈఏ హెచ్చరిక సందేశం అందుతుంది. భూకంప తీవ్రత సాధారణంగా ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చితే ఆడియో రూపంలోనూ హెచ్చరిస్తుంది.

ఏఈఏ వ్యవస్థ తొలుత 2020లో యూఎస్‌లో మొదలైంది. తర్వాత 2021లో న్యూజిలాండ్, గ్రీస్‌లో, ఆ తర్వాత మిగిలిన దేశాలకు పాకింది. 2023లో తుర్కియే  ఫిలిప్పీన్స్, నేపాల్‌లో సంభవించిన భూకంపాలపై ముందే అప్రమత్తం చేసి కాస్తునా ప్రాణనష్టం నివారించగలిగింది. 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలోని సమత్రా పశ్చిమ తీరంలో 9.1 తీవ్రతతో సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం, హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది.

కొన్ని గంటల్లోనే 14 దేశాల తీర ప్రాంతాల్లో  రాకసి అలలు విరుచుకుపడ్డాయి. అలలు దాదాపు 2.30 లక్షల మంది ప్రాణాలను కబళించాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ మహావిపత్తులో భారత్ కూడా తీవ్రంగానే నష్టపోయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ దీవులను తీవ్రంగా ప్రభావితం చేసింది. 2011లో జపాన్‌లో 9.0 తీవ్రతతో టోహోకు  తీరాన్ని ముంచెత్తింది.

సునామీ ధాటికి జపాన్‌లోని ఫుకుషిమా అణుప్రమాదం సంభవించడం తో దాదాపు 20వేల మంది మరణించారు. గతంలోనూ పలు సందర్భా ల్లో సునామీలు వచ్చినప్పటికీ పై రెండింటితో పోలిస్తే వాటి ప్రభావం తక్కువగానే వుంటుంది. ఈసారి రష్యా తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించడం అంటే మహావిప్తతు కిందే లెక్క. అన్ని దేశాలు సునామీ విపత్తును ముందే గుర్తించడంతో పెద్ద ముప్పు తప్పినప్పటికీ.. రానున్న రోజు ల్లో మరిన్ని సునామీలు సంభవించే ప్రమాదం మాత్రం పొంచే వుంది.