2028లో బీసీల రాజ్యాధికార ప్రభంజనం
గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తిలో బీసీ జెండా ఎగరడం ఖాయం
టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): తెలంగాణలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టిన ‘సర్జికల్ స్ట్రైక్59’ విశ్లేషణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని పార్టీ పేర్కొంది. గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి నియోజకవర్గాల్లో బీసీల ఓటు బలం అధికంగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం ఆశించిన స్థాయిలో లేదని టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.
వనపర్తిలో మొత్తం 2,71,371 ఓట్లకు గాను 1,70,595 బీసీ ఓట్లు ఉన్నాయని, ఇది సుమారు 62.87 శాతమని మల్ల న్న తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి 15,485 ఓట్లు మాత్రమే ఉన్నాయని, అయినప్పటికీ రాజకీయ ఆధిపత్యం కొనసాగు తోందని మండిపడ్డారు. 1985 తర్వాత వనపర్తిలో బీసీ ఎమ్మెల్యే లేకపోవడాన్ని ఆయన గుర్తు చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బీసీ ఎమ్మెల్యే అయ్యి తీరుతాడని తెలిపారు. గద్వాలలో మొత్తం 2,56,644 ఓట్లలో 1,77,781 ఓట్లు బీసీలవేనని, అంటే 69.26 శాతం అని తెలిపారు.
రెడ్డి సామాజిక వర్గానికి 10,174 ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోందని అన్నారు. 1999లో చివరి సారిగా గట్టు భీముడు బీసీ ఎమ్మెల్యేగా గెలిచిన విషయా న్ని గుర్తు చేస్తూ, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీసీ ఎమ్మెల్యే గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో 2,33,014 ఓట్లకు గాను 1,26,213 బీసీ ఓట్లు ఉన్నాయని, ఇది 54.16 శాతమని మల్లన్న పేర్కొ న్నారు. రెడ్డి సామాజిక వర్గానికి 12,714 ఓట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
గతంలో వంగా నారాయణ గౌడ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీసీల రాజకీయ సత్తాను చాటారని గుర్తుచేశారు. నారాయణపేటలో మొత్తం 2,32,062 ఓట్లలో 1,56,002 ఓట్లు బీసీలవేనని, అంటే 67.22 శాతం అని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి 10,652 ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ రాజకీయ అధికారం కొనసాగుతోందని విమర్శించారు. 2009 తర్వాత ఇక్కడ బీసీ ఎమ్మెల్యే లేకపోవడాన్ని గుర్తుచేశారు. 2028 అసెంబ్లీ ఎన్ని కల్లో ఈ నాలుగు నియోజకవర్గాల్లో బీసీ జెండా ఎగరాలి. ముందస్తు ఎన్నికలు వస్తే 2029లోనైనా బీసీల రాజకీయ సత్తా చాటా లి అని మల్లన్న స్పష్టం చేశారు.






