14-01-2026 12:58:36 AM
అవినీతిని కత్తిరించడమే లక్ష్యం
పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కి కేంద్ర ఎన్నికల కమిషన్ కత్తెర గుర్తును కేటాయించింది. అధికారిక ఉత్తర్వులు వెలువడటంతో పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరు పుకున్నారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఇది సామాన్యుడి ఆయుధమని బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం దిశగా ఈ గుర్తుతోనే యుద్ధం చేస్తాం అని ప్రకటించారు. అవినీతిని కత్తిరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.
జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీలకు రాజకీయాల్లో న్యాయమైన వాటా కల్పించి ఆత్మగౌరవం, అధికారం,- వాటా అనే ఈ మూడు సూత్రాలే పునాదిగా పార్టీ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, పారదర్శకమైన పాలన కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ముఖ్యంగా యువత, బీసీ సంఘాల నుంచి పార్టీకి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ‘కత్తెర‘ గుర్తును గ్రామగ్రామానికి తీసుకెళ్లి, రాబోయే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతామని కార్యవర్గ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై సామాన్యుడి గొంతుకగా మారిన తమ పార్టీకి, ఈ గుర్తు కేటాయింపు ఒక చారిత్రక మలుపు అని పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు.