07-01-2026 12:45:45 AM
ఆర్‌ఈసీ నుంచి రూ.4 వేల కోట్ల రుణం
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లను భూగర్భంలోకి మార్చేందుకు లైన్ క్లియర్ అయింది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) తక్కువ వడ్డీ రుణాలు అందిస్తోంది. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది కీలక అడుగు. మొదటి దశలో హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబు లింగ్ కోసం రూ. 4,000 కోట్లను ఆర్‌ఈసీ విడుదల చేయనుంది.
దీనికి సం బంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) దాదాపు పూర్తికావడంతో త్వర లో టెండర్లు పిలవనున్నారు. మూడు నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు కింద బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ వంటి ప్రాంతాల్లో 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ ఓవర్ హెడ్ లైన్లను భూగర్భ కేబుల్స్‌గా మార్చనున్నారు. ఇరుకైన వీధుల్లో ఖర్చు తగ్గించేందుకు ఏరియల్ బండిల్ కేబుల్స్ ఉపయోగించనున్నారు.
హైదరాబాద్ నగరవ్యా ప్తంగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థకు తెలంగాణ కేబినెట్ 2025 నవం బర్ 25న ఆమోదం తెలిపింది. మొత్తం వ్యయం సుమారు రూ. 14,725 కోట్లుగా అంచనా వేశారు. బెంగళూరు మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని, టీ-ఫైబర్ సహా వివిధ రకాల కేబుల్స్‌ను ఉపయోగించనున్నారు.
తొలిదశకు రూ. 4 వేల కోట్లు..
తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీ డీసీఎల్) పరిధిలో తొలి దశకు రూ. 4,051 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుతో విద్యుత్ నాణ్యత మెరుగుపడి, పెట్టుబడులు పెరగడంతో పాటు హైదరాబాద్ ప్రాంతం లో ఆర్థిక అభివృద్ధి వేగం అందుకోనుంది. ఇదే సమయంలో, తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో కూడా విద్యుత్ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ బలోపేతానికి, అండర్ గ్రౌండ్ కేబులింగ్ కోసం అదనపు రుణాలు ఇవ్వడానికి ఆర్‌ఈసీ సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి, అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి పని ప్రారంభించనుంది. ప్రభుత్వ శాఖల పెండిం గ్ విద్యుత్ బకాయిలు ఈ కొత్త డిస్కంకు బదిలీ చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంల క్రెడిట్ రేటింగ్ మెరుగుపడి, భవిష్యత్తులో మరిన్ని ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులకు రుణాలు సులభంగా లభించే అవకాశం ఉందని ఎనర్జీ అధికారులు తెలిపారు.