4 June, 2026 | 12:30 AM

‘అన్‌ప్యూరిఫెడ్’ దందా

04-06-2026 12:00 AM

అసలే ఎండాకాలం గుక్కెడు తాగునీటితో గొంతు తడుపుకుందామనుకొనే ప్రస్తుత సమయంలో కొందరు వ్యాపారులు మనిషి అవసరాలను తమ అవకాశంగా మార్చుకొని ధనార్జనే ధ్యేయంగా కలుషిత తాగునీటి వ్యాపారం నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అవి‘నీటి’ వ్యాపారులపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..

మురుగునీటి పక్కనే తాగునీటి వ్యాపారం

తాగునీటి క్యాన్లలో చిన్న చిన్న పురుగులు

కలుషిత తాగునీటితో అక్రమ వ్యాపారం 

అవినీతి వ్యాపారుల ఇష్టార్జ్యాం

హారతి కర్పూరంగా ప్రజారోగ్యం

ధనార్జనే ధ్యేయంగా తాగునీటి వ్యాపారం

మొద్దు నిద్రలో అధికారులు

కూకట్‌పల్లి, జూన్ 3 (విజయక్రాంతి) : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ఖైతలాపూర్ ఫ్లైఓవర్ సమీపంలో  మురుగునీటినాలకు ఆనుకొని కొందరు నీటి తోడేళ్లు ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా బోర్లు వేసి నిబంధనలకు విరుద్ధంగా తాగునీటి వ్యాపారం నిర్వహిస్తున్నారు. మురుగునీటినాలను ఆనుకొని బోరు వేయడం, ఆ నీటితో నిబంధనలకు విరుద్ధంగా మినరల్ వాటర్ ప్లాంట్ లు ఏర్పాటుచేసి నీటి వ్యాపారం నిర్వహిస్తున్నారు.

మురుగునీటి నాలా పక్కనే బోర్ ఉండడంతో బోరు నీరు కలుషితం అవుతుంది, ఆ నీటితోనే నిర్వాహకులు మినరల్ వాటర్ తయారుచేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా మినరల్ వాటర్ సరఫరా క్యాన్లలో  పలుమార్లు పురుగులు  వస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రజలు స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని  ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

మినరల్ వాటర్ ప్లాంట్‌కు సంబంధించిన ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా నిర్వాహకులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారన్నారు.స్వచ్ఛంగా శుద్ధితో ఉంటాయనే ప్రజల నమ్మకాన్ని నీటి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నట్టు స్థానికులు వాపోతున్నారు. మురుగునీటి నాలా పక్కనే ఎలాంటి  ప్రభుత్వ అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి అక్రమ నీటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కెపిహెచ్బి కాలనీ 4 వ ఫేస్, 7వ ఫేస్, 15వ ఫేస్, లలో సరఫరా అయ్యే తాగునీటి క్యాన్ లలో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుచున్నారు.