09-02-2026 12:39:58 AM
సులభంగా లక్ష బస్తాల యూరియా పంపిణీ
మహబూబాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పంటల సాగుకు అవసరమైన యూరియా పంపిణీ సులభంగా చేయడానికి ప్రవేశపెట్టిన యాప్ మొదట్లో కొంత తట పటా యించగా, బాలారిష్టాలను దాటి ఇప్పుడు యూరియా యాప్ సరైన గాడిలో పడింది. మహబూబాబాద్ జిల్లాలో గత పది రోజుల నుండి రైతులు యాప్ ద్వారా పంటల సాగుకు అవసరమైన యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకుని సులువుగా పొందుతున్నారు.
ఇందుకోసం వ్యవసాయ శాఖ జిల్లా స్థాయి అధికారులు మొదలుకొని క్లస్టర్ ఏఈఓ వరకు యాప్ ద్వారా యూరియా పొందడానికి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నెట్వర్క్, ఇతర సాంకేతిక సమస్యలను కూడా అతిక్రమించే విధంగా ప్రత్యామ్నాయ విధానాలను క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు వివరిస్తూ యాప్ ద్వారా యూరియా సులభంగా పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
దీనితో మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో యాసంగి సీజన్ లో 2,73,000 ఎకరాల భూమిలో సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలతోపాటు వానకాలంలో సాగు చేసిన మిర్చి తదితర పంటలకు అవసరమైన యూరియాను గత నెల 29 నుండి ప్రత్యేక యాప్ ద్వారా పొందుతున్నారు. మొత్తంగా ఈ పంట సీజన్ పూర్తయ్యేవరకు మూడు లక్షల ఎకరాల భూమిలో సాగైనా పంటలకు అవసరమైన యూరియాను పూర్తిగా యాప్ ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సరిత తెలిపారు.
ఇప్పటివరకు 30, 275 మంది రైతులు 1,27,075 యూరియా బస్తాలను యాప్ ద్వారా పొందడానికి బుక్ చేసుకున్నారని, అందులో 1,03,519 బస్తాల యూరి యాను తీసుకెళ్లారని చెప్పారు. యాప్ ద్వారా యూరియా కోసం బుక్ చేసుకున్న రైతులకు యూరియా పొందడానికి 24 గం టల గడువు ఉంటుందని, ఆ గడువులోగా తీసుకోకుంటే మళ్లీ బుక్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎకరం పంటకు మూడు బస్తాల యూరియా ఇవ్వడం జరుగుతుందని, ఒకేసారి మూడు బస్తాలు, లేదంటే రెండు ఒకటి చొప్పున కూడా తీసుకోవచ్చని చెప్పారు.
తమకు అందుబాటులో ఉన్న ఎరువుల విక్రయ షాపులో స్టాకు యాప్ ద్వారా చూసుకొని పొందవచ్చని చెప్పారు. యాప్ బుకింగ్ ద్వారా జిల్లాలో యూరియా పంపిణీ నిర్వహిస్తున్నామని, గత పది రోజుల నుండి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతోందని డీఏవో చెప్పారు. గంటల తరబడి క్యూలో నిలబడడం, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, యూరియా తెప్పించడం మొదలుకొని పంపిణీ వరకు కత్తి మీద సాముగా మారిన యూరియా పంపిణీ ఇప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా సాగుతోంది.
సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో సెల్ ఫోన్ నెట్వర్క్ సమ స్య నెలకొంది. అయితే ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న నెట్ వర్క్ ప్రొవైడర్ వినియోగిస్తున్న యువత, అంగన్వాడి, పంచాయతీ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల ద్వారా ఏవో, ఏఈఓలు రైతులకు అవసరమైన యూరియాను పొందే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. రైతులు లింక్ చేయబడ్డ ఫోన్ నెంబర్ ద్వారా పనిచేసే ప్రొవైడర్ వినియోగిస్తున్న వారి ఫోన్ నెంబర్ నుంచి యూరియా బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న సెల్ఫోన్ ప్రొవైడర్ కు రైతులను మార్చుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. దీనికి తోడు తమకు అందుబాటులో ఉన్న ఎరువుల షాపుకు వెళ్లి అక్కడే యాప్ ద్వారా బుక్ చేసుకుని యూరియా పొందే విధంగా ఎరువుల షాపు వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎరువుల షాపు యజమానుల సహకారంతో సులువుగా యూరియా పంపిణీకి చర్యలు చేపట్టారు.
ఇబ్బంది పోయింది
మొన్నటివరకు యూరియా కోసం పడరాన్ని పాట్లు పడ్డాం. ఇప్పుడు యాప్ ద్వారా సులభంగా యూరియా దొరుకుతుండడంతో ఇబ్బంది తొలగిపోయింది. ఫోన్లో నాకు అందుబాటులో ఉన్న షాపులో యూరియా స్టాక్ చూసుకొని బుక్ చేసుకున్నాను. గతంలో మాదిరిగా మా మండలానికి వెళ్లి క్యూ లైన్ లో నిలబడి, ఒకరోజు టోకెన్, ఒకరోజు యూరియా తీసుకునే ఇబ్బంది తొలగిపోయింది. యాప్ బుకింగ్ ద్వారా కేసముద్రంలో వ్యక్తిగత పనుల కోసం వెళ్లి అక్కడి నుండే సులభంగా యూరియా తెచ్చుకున్నాను. ఇదే పద్ధతిని వచ్చే వానకాలంలో కూడా అమలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
నునావత్ విజయ్ కుమార్, రైతు, దామరవంచ