అనుమానాస్పద స్థితిలో దూడలు మృత్యువాత
కన్నెత్తి చూడని పశు, అటవీశాఖ అధికారులు
భయందోళనలో గ్రామస్తులు
కోనరావుపేట, మార్చి 31: గ్రామశివారులో ఉన్న పశువుల పాకల వద్ద రోజుకో దూడ వరుసగా మృతువాత పడుతున్నాయి. దూడల వెనుకభాగంలో దాడి చేసి హతమోందించడంతో కుక్కలూ చంపుతున్నాయా, చిరుత చంపుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓకే విధంగా రాత్రి సమయాన దూడలు మృతిచెందడం, అక్కడే చంపిన జంతువు కాలిముద్రలు పెద్ద ఉండడంతో రైతులు అందోళన చెందుతున్నారు. ఈఘటన కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామశివారులో శ్రీగుడిపేట రామలింగేశ్వర స్వామి ఆలయం వైపు గ్రామానికి చెందిన పలువురి రైతుల పశువుల పాకలు ఉన్నాయి.
ఎండకాలం కావడంతో రైతులు రాత్రి సమయాన మేత కోసం పశువులను బయటనే కట్టివేసి ఉంచుతున్నారు. రైతులు సాయంత్రం వేళలలో పాడిగేదేల పాలుపితికి దూడలను కట్టివేసి ఇంటికి వస్తున్నారు. తెల్లవారుజామున వెళ్లే సరికి దూడలు మృతిచెంది ఉంటున్నాయి. ఇలా ఈనెల 29న లంబ పుట్టయ్య అనే రైతుకు చెందిన దూడ శరీరం వెనుక భాగంలో దాడి చేయడంతో కట్టివేసిన దూడ అక్కడే మృతిచెందింది. అదే తీరుగా సోమవారం తాళ్లపల్లి అరవింద్ అనే యువరైతుకు చెందిన దూడను వెనుకభాగంలో దాడి చేసి హతమార్చింది. దీంతో సదరు రైతు దూడ మృతిచెందిన వద్ద పెద్దపెద్దగా కాలిముద్రలు ఉన్నట్లు తెలిపారు.
దీంతో సదరు రైతులు సుమారు రూ.20వేల విలువగల దూడలు దాడిలో నష్టపోయినట్లు పేర్కోన్నారు. ఇక ఈఘటనలు వరుసగా రాత్రి సమయంలో జరగతుండడంతో దూడలు ఎలా మృతిచెందుతున్నాయో రైతులకు పాలుపోవడంలేదు. ఈక్రమంలో గంగిరెద్దుల కాలనీవాసుల కుక్కలు చంపుతున్నాయా, చిరుత చంపివేస్తుందా అని రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడ ఇదే శివారులో ఈర్ల మొండయ్య అనే రైతుకు చెందిన రెండు దూడలు మృతిచెందినట్లు రైతులు తెలిపారు. ఇదంతా జరుగుతున్న అటవీ శాఖ అధికారులు, పశువైద్యాధికారులు కన్నెత్తి కూడా చూడడంలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్ధాయిలో పరిశీలించి మృతిచెందిన దూడలకు నష్టపరిహారం అందించేలా చూడలని కోరడంతో పాటు పశువులను రక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
నష్టపరిహారం అందించాలి: తాళ్లపల్లి అరవింద్, యువరైతు, నిజామాబాద్(కోనరావుపేట)
గ్రామశివారులో ఉన్న మూలవాగు ప్రాంతంలో రామలింగేశ్వర స్వామి ఆలయం ముందు వైపు పశువుల పాక వద్ద పాడిగేదేలను రోజుమాదిరిగానే కట్టివేసి ఉంచాను. ఆదివారం రాత్రి సమయాన కూడ గేదేలను మేత కోసం చెట్టుకు కట్టివేసి ఇంటికి వచ్చాను. సోమవారం ఉదయం హనుమాన్ దీక్ష పరుడు దూడ మృతిచెందినట్లు సమాచారం అందించాడు. వెంటనే అక్కడి వెళ్లి చూశాను. దూడ మృతిచెంది ఉండగా పక్కనే పెద్ద పెద్ద కాలిముద్రలు ఉన్నాయి. దీంతో సుమారు రూ.10వేల విలువ గల దూడను నష్టపోయాను. ఇలాగే మా గ్రామంలో వరుస దూడలపై వరుస దాడులు జరుగుతున్నాయి. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి చనిపోయిన దూడలకు నష్టపరిహారం అందించాలి.






