కమనీయం.. రమణీయం వెంకటేశ్వరుడి కల్యాణం
మంగపేట, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేంకటేశ్వరుని కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక వేదం అధ్యయన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీకుమారాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు.
అనంతరం పద్మావతి, అలివేలుమంగ అమ్మవార్లతో వెంకటేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పాణిగ్రహణం ( జీలకర్ర బెల్లం) కార్యక్రమం, మాంగల్య ధారణ, ముత్యాలతో తలంబ్రాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయంలో భక్తులు ఆలపించిన భక్తి గీతాలు, మహిళా భక్తులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కల్యాణ మహోత్సవం తిలకించడానికి ఆలయానికి విచ్చేసిన భక్తులు భక్తి పారవశ్యంతో చేసిన శ్రీనివాసుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగిపోయింది. కళ్యాణ మహోత్సవానికి, అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లను చేశారు. ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్ ఐ టీ.వీ.ఆర్.సూరి, తహసీల్దార్ తోట రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వరరావు కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.




