25 April, 2026 | 1:48 AM

కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం

10-05-2024 02:11 AM

నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి

రంగారెడ్డి, మే 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలోనే నిరుపేదలకు సంక్షేమం అందుతుందని నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి అన్నారు. గురువారం తలకొండపల్లి మండలంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చారకొండ వెంకటేశ్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆరు గ్యారెంటీలు అందుతాయని చెప్పారు.

మోదీ పదేళ్ల పాలనలో విధ్వంసం సృష్టించారన్నారు. కార్పొరేటక్లు లక్షల కోట్లు మాఫీ చేసి పేదలపై పన్నుల భారం మోపారని ఆరోపించారు. వచ్చేది కాం గ్రెస్ ప్రభుత్వమని, రాహుల్‌గాంధీ ప్రధాని కానున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మాయమాటలు నమ్మవద్దని, రవిని గెలిపిస్తే ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తామని చెప్పారు.

బాధిత కుటుంబాలకు అండగా..

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పరశురామ్, నరేశ్ కుటుంబసభ్యులకు తాము అండగా ఉంటామని మల్లు రవి, నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. వెంకటాపూర్ గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులో మృతిచెందడం కుటుంబాలకు తీరని లోటు అన్నారు.