20 May, 2026 | 12:29 PM

ఐఎన్టీయూసీ వల్లే జలమండలి కార్మికుల సంక్షేమం సాధ్యం

20-05-2026 12:00 AM
  1. గతంలో మోసగించిన సంఘాలకు ఓట్లు వేస్తే మురిగినట్లే
  2. కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐఎన్టీయూసీ త్రిశూలం గుర్తుకు ఓటు వేయాలి
  3. తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి

ముషీరాబాద్, మే 19 (విజయక్రాంతి): జరగబోయే జలమండలి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో అనేక దశాబ్దాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి వీఎస్టీ  ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొగుళ్ళ రాజీరెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్యెల్యే కాలే యాదయ్య, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్ల నరసింహ రెడ్డి,  ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్.డి. చంద్రశేఖర్, యరగోని నాగన్న గౌడ్, అదిల్ షరీఫ్, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్, ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు కె. రాజిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

రాజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం జలమండలి కార్మికుల పట్ల కర్కశంగా వ్యవహరించిందని ఆరోపించారు. బీఆర్టీయూ నేత కార్మికుల ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు. ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ త్రిశూలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మొగుళ్ళ రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఎమ్యెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోరే కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నేతలు మహేష్, అక్తర్ అలీ, విశ్వనాథ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.