11-01-2025 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే వివాదాస్పద ప్రకటనలతో పొరుగుదేశాలను భయపెడుతున్నారు. ఇప్పటికే కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా పేర్కొన్న ట్రంప్ తాజాగా పనామా కాలువ, గ్రీన్‌లాండ్‌ను కూడా కొనేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ర్యాలీలో మాట్లాడుతూ అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
అమెరికా వాణిజ్య, నావికాదళ నౌకలనుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, వీటిని తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అమెరికాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తాము ఈ కాలువను పనామాకు ఇచ్చాం తప్ప చైనాకు కాదంటూ కూడా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌లాండ్‌నూ కొనేస్తా మంటూ హెచ్చరించారు.
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ మూడింటి కోసం ట్రంప్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో పెట్టడం గమనార్హం. అయితే వివాదాస్పద ప్రకటనలు చేయడం ట్రంప్‌కు కొత్తేమీ కాకపోవడంతో ఈ వ్యాఖ్యలు కూడా అలాంటివేనని కొందరు కొట్టిపడేస్తుంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం ట్రంప్ చాలా దూరదృష్టితోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.
దానికి తోడు అర్కటిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని విస్తరించడం ద్వారా అఖండ అమెరికాను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉండి ఉండవచ్చని వారంటున్నారు. నిజానికి ప్రపంచ సముద్ర వాణిజ్య మార్గాలో కీలకమైన పనామా కాలువను మొదట అమెరికాయే నిర్మించింది. అయితే 1977లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, పనామా సైనిక నియం త టొరిజోస్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ కాలువను, దాని పరిధిలోని ప్రాంతాలను 1999 తర్వాత అగ్రరాజ్యం పనామాకు అప్పగించింది.
అప్పటినుంచి ప్రత్యేక పనామా అథారిటీ దీన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ కాలువ చుట్టుపక్కల సముద్ర జలాల్లో చైనానౌకలు ఉండడం అమెరికాకు భద్రతాపరంగా ఇబ్బందికరంగా మారింది. ఇక డెన్మార్క్‌లో భాగంగా ఉన్నప్పటికీ గ్రీన్‌లాండ్ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఉంది. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్‌లాండ్ అత్యంత అవసరమని, దీనిపై హక్కును సాధించి తీరుతామని ట్రంప్ అంటున్నారు. ఈ లక్ష్యాలను సాధించడం కోసం బలప్రయోగం చేసేందుకు కూడా సిద్ధమేనన్న పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
అయితే ట్రంప్ ఈ వివాదాస్పద ప్రకటనలు చేయడం వెనుక బలమైన రాజకీయ, భౌగోళిక కారణాలున్నాయనేది పరిశీలకుల అభిప్రాయం. గ్రీన్‌లాండ్, కెనడాలు భాగంగా ఉన్న ఆర్కటిక్ ప్రాంతంలో ప్రపంచంలోని 30 శాతం గ్యాస్, 13 శాతం చమురు నిక్షేపాలున్నాయనేది అమెరికా జియలాజికల్ సర్వే అంచనా. అంతేకాకుండా గ్రీన్‌లాండ్‌లో అత్యంత అరుదైన ఖనిజాలతో పాటుగా ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు.
రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల కారణంగా ఈ ప్రాంతం లోని మంచు భారీగా కరిగిపోతే వాటి అన్వేషణ సులువుతుందనేది ట్రంప్ ఆలోచనగా చెప్తున్నారు. వీటన్నిటికి తోడు ఈ ప్రాంతంలో రోజురోజుకు పెరిగిపోతున్న చైనా, రష్యాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడం కూడా ట్రంప్ వ్యాఖ్యల అంతరార్థంగా విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ట్రంప్ చేసిన ఈ వివాదాస్పద ప్రకటనలను ఇప్పటికే కెనడాతో పాటుగా పనామా, డెన్మార్క్‌లు కొట్టిపారేశాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ (ఈయూ) లో సభ్య దేశాలయిన కెనడా, డెన్మార్క్‌ల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఐరోపా సమాఖ్య ఇప్పటికే హెచ్చరించింది. ప్రస్తుతానికి ట్రంప్ చేసింది ప్రకటనలే. అధికారం చేపట్టాక కానీ ఈ విషయంలో ఆయన చర్యలు ఎలా ఉంటాయి, వాటి పరిణామాలు ఏమిటనేది తెలియదు.