15-01-2026 02:27:31 AM
* మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఈసారి మునుపెన్నడూ లేనివిధంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దాదాపు 251 కోట్ల రూపాయల వ్యయంతో 200 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండేవిధంగా మేడారం అభివృద్ధి, గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ కోసం కేటాయించారు. ఆశయం మంచిదే అయినప్పటికీ కేవలం 100 రోజుల్లోనే పనులు పూర్తిచేయాలని గడువు నిర్ణయించుకోవడం వల్ల పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో కొన్ని అస్తవ్యస్తంగా సాగుతున్నాయి.
101 కోట్ల రూపాయలతో చేపట్టిన గద్దెల ప్రాంగణం ఆధునికీకరణ పనులు కూడా అదే తీరులో కొనసాగుతున్నాయి. జాతర ప్రారంభానికి పట్టుమని 14 రోజుల గడువే ఉండగా, ఇప్పటివరకు అనేక పనులు సాగుతూనే ఉన్నాయి. ఈసారి కొత్తగా భక్తులకు కవర్ షెడ్డు క్యూలైన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించగా, ఆ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. గద్దెల ప్రాంగణంలో రాతి ఫ్లోరింగ్ పనులు ఇంకా పూర్తి చేయలేదు. అలాగే రాతి ప్రాకారాలపై సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేస్తుండడంతో సగం రాతిశీలలు, సగం సిమెంటు పనులు అంటూ భక్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నాలుగు లైన్ల రోడ్ల విస్తరణ పనులు, భక్తులకు సౌకర్యాల కల్పన పనులు ఇప్పటికీ పూర్తిచేయకపోవడంతో అటు భక్తుల రాక, ఇటు పనులు సకాలంలో పూర్తయ్యే పరిస్థితి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాశ్వతంగా చేపట్టాల్సిన పనులకు 100 రోజుల గడువు ఎందుకు విధించారని, జాతరకు చాలా రోజుల ముందుగా లేదంటే.. జాతర ముగిసిన తర్వాత పనులు నాణ్యతతో చేపడితే బాగుండేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఎం రాంచందర్ :
మేడారం, జనవరి 1౪ (విజయక్రాంతి): మేడారం మహా జాతర సమగ్ర అభివృద్ధి కోసం స్వయంగా మేడారం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రకటించారు. గత ఏడాది ఆదివాసీ పూజారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, పెద్దలతో చర్చించి శాశ్వత ప్రాతిప దికన మేడారం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గత ఏడాది సెప్టెం బర్‌లో మేడారం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 101 కోట్ల రూపాయలతో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని రాతి ప్రాకారాలతో పునరుద్ధరించాలని నిర్ణయించారు.
అలాగే 150 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను నిర్వహించడానికి కేటాయించాలని తీర్మానించారు. 100 రోజుల్లో మేడా రం మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు, గద్దెల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని గడువు నిర్ణయించారు. ఆ మేరకు గత ఏడాది సెప్టెంబర్ 5న ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ పను లు చేపట్టడానికి అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మేడారం వచ్చి మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికను ప్రకటించారు.
2౦౦ ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా..
శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. పూర్తిగా రాతి శిలలతో, ఆదివాసీ గిరిజన సంస్కృ తి సంప్రదాయాలకు అనుగుణంగా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా చేపట్టారు. 200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేందుకు రాతి ప్రాకారాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం గతంలో సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల ప్రాంగణంలో పలు నిర్మాణాలను తొలగించారు. గద్దెల ప్రాంగణాన్ని విస్తరించి, ఒకేసారి పదివేల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుని బయటకు వెళ్లే విధంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఒకే వరుసక్రమంలో ఏర్పాటు చేయ తలపెట్టారు.
అలాగే నలుగురి గద్దెల ప్రాంగణాల ను రాతి శిలలతో ఆదివాసి గిరిజన సంస్కృ తి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా చెక్కడాలతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే గద్దెల ప్రాంగణాన్ని విస్తరించి రాతి ప్రాకారాలు ఏర్పాటు చేయతలపెట్టారు. దీనితోపాటు మేడారం నలువైపులా రహదా రులను నాలుగు లైన్ల రహదారులుగా విస్తరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. జంపన్న వాగులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే విధంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
గడువు కాలం పెంపు..
అయితే, అభివృద్ధి పనులన్నీ వంద రోజుల్లో అంటే ౨౦౨౬ జనవరి ౫ వరకు పూర్తిచేయాలని గడువు పెట్టారు. ఆ తర్వాత జనవరి 12, ఇప్పుడు తాజాగా జనవరి 18 లోపు పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మేడారం పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే నేటికీ 101 కోట్ల రూపాయలతో చేపట్టిన గద్దెల ప్రాంగణం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గద్దెల ప్రాంగణంలో ఐదు శిలా ప్రాకారాలతో కూడిన ద్వారాల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పలుచోట్ల చెక్కడాలు పూర్తికాలేదు. ఫ్లోరింగ్ పనులు 20 శాతానికి పైగా మిగిలి ఉన్నాయి. అలాగే రాతి ప్రాకారాల చుట్టూ ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటూ కొనసాగుతూనే ఉంది.
లైటింగ్, ఇతర సుందరీకరణ పనులు ఇప్పుడిప్పుడే మొదలెట్టారు. ప్రధాన ద్వారం నుంచి గద్దెల ప్రాంగణం వరకు సిమెంట్ రెండు పనులు నిర్వహిస్తున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై ప్రతిష్టాపన పనులు పూర్తికాగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధి పనులు ఈ నెల 14 తర్వాత పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రధాన ద్వారం మొదలుకొని భక్తుల ఎగ్జిట్ ద్వారాల పైన సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేసి వాటిపైన రాతి ప్రాకారాలు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. క్యూలైన్ల పైన కొత్తగా షెడ్ల నిర్మాణం ఇప్పుడే మొదలు పెట్టారు. క్యూలైన్లను ఒకవైపు పూర్తి చేయగా మరోవైపు పనులు కొనసాగిస్తున్నారు.
ఇక మేడారం నలువైపులా సిమెంటు రోడ్ల పనులు పూర్తిస్థాయిలో చేయలేదు. డివైడర్ల నిర్మాణం ఇంకా చేపట్టలేదు. అలాగే స్తూపం నుంచి కొత్తూరు వరకు నాలుగు లైన్ల సిమెంటు రోడ్డు పనులు ఒకవైపు పూర్తికాగా మరోవైపు జరుగుతున్నాయి. రెడ్డిగూడెం నుంచి.. ఇంగ్లిష్ మీడియం స్కూల్ నుంచి గద్దెల ప్రాంగణం వరకు రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణం పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇక జంపన్న వాగులో పూర్తిస్థాయిలో ఇసుక లెవలింగ్ చేయలేదు.
అభివృద్ధికి చేపట్టిన పనులు.. నిధుల కేటాయింపు
* గద్దెల ప్రాంగణం అభివృద్ధి: రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్లు
(పనులు: సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల సమగ్ర అభివృద్ధి, రాతి ఫ్లోరింగ్, క్యూలైన్లు, దర్శన ప్రాంగణం విస్తరణ)
* శిల్పకళ, సాంస్కృతిక అలంకరణ: రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్లు
(పనులు: ఆదివాసీ చరిత్రను ప్రతిబింబించే రాతి శిల్పాలు, గోడ చిత్రాలు, శిలా కళాకృతులు, గద్దెల చుట్టూ కళాత్మక డిజైన్)
* జంపన్నవాగు అభివృద్ధి: రూ. 35 కోట్ల నుంచి రూ.40 కోట్లు
(పనులు: ఘాట్ల నిర్మాణం, భద్రతా గోడలు, వరద నియంత్రణ, పరిసరాల సుందరీకరణ)
* భక్తుల మౌలిక సదుపాయాలు: రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్లు
(పనులు: తాగునీటి సరఫరా వ్యవస్థ, శాశ్వత మరుగుదొడ్లు, విశ్రాంతి మండపాలు, నీడ ప్రాంతాలు)
* రోడ్లు, ప్రవేశ మార్గాలు, పార్కింగ్: రూ.50 కోట్ల నుంచి రూ.55 కోట్లు
(పనులు: ప్రధాన రోడ్ల విస్తరణ, ప్రవేశ నిష్క్రమణ మార్గాల అభివృద్ధి, పార్కింగ్ స్థలాల ఏర్పాటు)
* విద్యుత్, భద్రత, అత్యవసర సేవలు: రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు
(పనులు: విద్యుత్ లైటింగ్, సీసీ కెమెరాలు, అగ్నిమాపక, వైద్య సేవల మౌలిక వసతులు)
* మొత్తం మాస్టర్ ప్లాన్ వ్యయం: సుమారు రూ.230 కోట్ల నుంచి రూ.240 కోట్లు
కొనసాగుతున్న పనులు..
మేడారం జాతర సందర్భంగా భక్తులు ఎక్కువగా విడిది చేసే రెడ్డిగూడెం, మేడారం, కన్నేపల్లి, కొత్తూరు, నార్లాపూర్, చింతల్, ఏలుబాక, కొంగల మడుగు, ఊరట్టమ్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో భక్తులకు స్నాన ఘట్టాలు, తాగునీటి వసతి, వ్యక్తిగత మరుగుదొడ్ల ఏర్పాటు, పార్కింగ్ బ్లాక్ ల కేటాయింపు పనులు కొనసాగుతున్నాయి. చిలకల గట్టు నుంచి మేడారం గద్దెల ప్రాంగణం వరకు మళ్లీ కొత్తగా సిమెంట్ రోడ్డు పనులను చేపడుతున్నారు. అలాగే వీఐపీ పార్కింగ్ నుండి గద్దెల వరకు రహదారి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.
జంపన్న వాగు నుంచి మేడారం గద్దెల వరకు పలు కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పగిడిద్దరాజు, గోవిందరాజు విడిది చేసేందుకు ఏర్పాటుచేసిన భవనాల్లో ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మేడారం జాతర మహాద్వారాలకు రంగులు వేసే పనులు ఇంకా పూర్తి కాలేదు. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని, దర్శన పరిస్థితిని పర్యవేక్షించడానికి గద్దెల ప్రాంగణానికి ఇరువైపులా చేపట్టిన వాచ్ టవర్ల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. అలాగే ఎగ్జిట్ పాయింట్లు నుంచి భక్తులు బయటికి వెళ్లే మార్గాల్లో రహదారి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇలా మేడారం జాతరలో చేపట్టిన పనుల వివరాలను చూస్తే జాతర పూర్తయిన తర్వాత కూడా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
భక్తులు ఈసారి జాతరలో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాస్టర్ ప్లాన్ పనులు అస్తవ్యస్తంగా మారడంతో, భక్తులు ఈసారి సరికొత్త ఇబ్బందులతో వనదేవతలను దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో, అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఆ విషయం ప్రభుత్వానికి అధికారులకు ముందే తెలిసినప్పటికీ వందరోజుల్లో శాశ్వత ప్రాతిపదికన పనులు ఎలా నిర్వహించడానికి పూనుకున్నారు అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.
భక్తుల అసంతృప్తి..
ప్రభుత్వం సదాశయంతో చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనులను జాతర ముగిసిపోయిన తర్వాత లేదంటే జాతరకి ఏడాది ముందు నిర్వహిస్తే బాగుంటేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. జాతరకు నెలల ముందుకు చేపట్టి పనులు ఇంత అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం కూడా లేదనే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆగ మేఘాలపై చేపడుతున్న పనులు నాణ్యతతో ఉండటం లేదని, తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో పరచిన రాతి ఫ్లోరింగ్ ఇప్పటికే పలుచోట్ల పగుళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. అలాగే గద్దెలపై పరిచిన రాతి ఫ్లోరింగ్ కూడా ఎగుడు దిగుడుగా ఉందంటున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాస్టర్ ప్లాన్.. మేడారం జాతరలో భక్తులకు సౌకర్యం మాట అటుంచి.. కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.