22 March, 2026 | 1:22 AM

యువ దర్శక నామ సంవత్సరం!

22-03-2026 12:00 AM

రాజమౌళి, సుకుమార్, సందీప్‌రెడ్డి వంగా, కొరటాల శివ, త్రివిక్రమ్ లాంటి సీనియర్ డైరెక్టర్ల సినిమాలేవీ ఈ ఏడాది విడుదలయ్యే పరిస్థితి లేదు. వీళ్లలో కొంత మంది కొత్త చిత్రాలతో ఆన్ సెట్స్‌లో బిజీగా ఉండగా, మరికొంత మంది కొత్త ప్రాజెక్టులను సెట్ చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. సో, వీళ్లందరి కథలు తెరపై కనిపించేది వచ్చే ఏడాది మాత్రమేనని అర్థమవుతోంది. అప్పటిదాకా టాలీవుడ్‌లో హవా సాగించేదెవరు అంటే, యువ దర్శకులే అంటున్నారు సినీ జనాలు! అంటే, ఈ పరాభవ నామ సంవత్సరం కాస్తా సినీ పరిశ్రమకు ‘యువ దర్శక నామ సంవత్సరం’గా మారిందన్నమాట!! 

హడలెత్తించే జడల్ కథతో వస్తున్న శ్రీకాంత్ ఓదెల 

శ్రీకాంత్ ఓదెల తన రెండో చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘దసరా’ భారీ విజయం సాధించడంతో వెంటనే మళ్లీ ‘ది ప్యారడైజ్’ కోసం చేతులు కలిపారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ప్రపంచ స్థాయి స్థాయిలో రూపొందిస్తున్నారు. నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో పాన్ వరల్డ్ రిలీజ్‌కు సిద్ధమవుతోందీ చిత్రం. 

‘పెద్ది’.. బుచ్చిబాబు రెండో సినిమా.. 

రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఈ వేసవిలో పాన్ ఇండియాలో విడుదలవుతోంది. చెప్పుకోవడానికి ఇది పెద్ద ప్రాజెక్టు. కానీ బుచ్చిబాబు మాత్రం యువ దర్శకుడే. ఆయనకిది రెండో చిత్రం మాత్రమే. ‘ఉప్పెన’ మంచి విజయం సాధించడంతో బుచ్చిబాబుపై నమ్మకంతో రామ్‌చరణ్ అవకాశం ఇచ్చారు. ఈ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో విడుదల చేస్తుండటం విశేషం. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. 

రెండో చిత్రమే మెగాస్టార్‌తో.. 

తొలి సినిమా ‘బింబిసార’తో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు వశిష్ట. దీంతో మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఆయనకు అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమే ‘విశ్వంభర’. దర్శకుడిగా వశిష్టకు ఇది రెండో చిత్రం. సోషియా ఫాంటసీ థ్రిల్లర్ ఇది. సినిమా విజువల్‌గా హైలైట్ కానుంది. ఆ కారణంగా ప్రాజెక్ట్ రిలీజ్ కూడా ఆలస్యం జరుగుతోంది. ఈ సినిమాను ఇదే ఏడాది విడుదల చేసే అవకాశాలున్నాయి.  

కొత్త దర్శకుడి ‘సంబరాల ఏటిగట్టు’ 

సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్త్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. ఈ సినిమాతో రోహిత్ కేపీ అనే యంగ్ టాలెంటెడ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రోహిత్ కేపీ ఇంతకుముందు ‘లాల్ సింగ్ చద్దా’, ‘బంటీ ఔర్ బబ్లీ 2’ వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ తాజా చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదొక హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా. 1960ల నాటి నేపథ్యంలో సాగే కల్పిత కథగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయడమే కాకుం డా, గ్రాఫిక్స్ వీఎఫ్‌ఎక్స్ పరంగా కూడా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నారు. 

అదిరే అభి దర్శకత్వంలో రెండో సినిమా.. 

అదిరే అభి అనే స్క్రీన్‌నేమ్‌తో జబర్దస్త్ షోలో ప్రేక్షకులను అలరించారు కమెడియన్ అభినయ కృష్ణ. ఆయన దర్శకుడిగా మారిన తర్వాత తెరకెక్కిస్తున్న రెండో సినిమా ‘కామాఖ్య’. ఆయన ఇంతకుముందు ‘చిరంజీవా’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యా రు. తొలి చిత్రంలో య మధర్మరాజుకు ఒక గుడి ఉందని, అది తెలంగాణలోనే ఉందని చెప్పిన ఆయన ఇప్పుడు రెండో సినిమాను కామాఖ్య అమ్మవారి నేపథ్యంలో రూపొందిస్తున్నారు. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీవాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

టాలీవుడ్ ‘తండేల్’తో కార్తీక్ దండు థ్రిల్లర్ మూవీ 

అక్కినేని నాగచైతన్య ‘తండేల్’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఇటీవల గద్దర్ సినీ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘వృషకర్మ’. ఇదొక మిస్టకల్ స్పెక్టికల్ థ్రిల్లర్ మూవీ. దీనికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ దండు ఇంతకుముందు ‘విరూపాక్ష’ సినిమాను తెరకెక్కించారు.

సాయి దుర్గా తేజ్ హీరోగా నటించిన ఆ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న కార్తీక్ దండు ఇప్పుడు నాగచైతన్యను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు. ప్రముఖ బ్యానర్లు ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండటం, బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండటం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య ఈ సినిమాలోని అర్జున్ పాత్రను పోషించేందుకు ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఈ సినిమా వేసవిలో వినోదం పంచేందుకు సిద్ధమవుతోంది. 

ఏడోశతాబ్దపు యోధుడి కథతో సంకల్ప్‌రెడ్డి 

మ్యాచో స్టార్ గోపీచంద్ కథనాయకుడిగా దర్శకుడు సంకల్ప్‌రెడ్డి మరో ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఘాజీ’ తర్వాత సంకల్ప్ రెడ్డి సరైన విజయాన్ని అందుకోలేదు. దీంతో ఈ సినిమాతో ఆయన సక్సెస్ అవుతారని అంతా ఆశీస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటిస్తున్న 33వ సినిమా ఇది. ‘భరత వర్ష’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఏడో శతాబ్దానికి చెందిన కథ. ఈ సినిమాలో గోపిచంద్ యోధుడిలా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

రాకాసతో లేడీ డైరెక్టర్ పరిచయం

‘కమిటీ కుర్రోళ్లు’తో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు నిర్మాత నిహారిక కొణిదెల. ఇక ప్రస్తుతం ఆమె తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ సినిమాతో వెండితెరకు ఓ లేడీ డైరెక్టర్ పరిచమవుతోంది. ఆమే మానసశర్మ. ఈ యువ దర్శకురాలి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. మానస బిగ్‌స్క్రీన్‌కు కొత్తే కానీ, సినిమాలకు కాదు.

ఇదివరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్టుల్లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానసశర్మ భాగమయ్యారు. ముఖ్యంగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్‌లో సంగీత్ ప్రధాన పాత్రలో నటించగా, మానస శర్మ రచయితగా పనిచేశారు. మానస ‘బెంచ్ లైఫ్’కూ దర్శకత్వం వహించారు. తాజాగా ‘రాకాస’ చిత్రంతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.