‘దిశ’ పోలీసులపై కేసులు వద్దు

02-05-2024 01:35:33 AM

జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘దిశ’ లైంగికదాడి, హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చట్టన్‌పల్లి వద్ద జరిగిన ఘటన, ఆ తర్వాత చోటుచేసుకొన్న ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఏకపక్షంగా ఉన్నదని నాటి షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఏ శ్రీధర్ కుమార్, అప్పటి తహసీల్దార్ జారుప్లవత్ పాండు దాఖలు చేసిన వేరువేరు వ్యాజ్యాలను జస్టిస్ బీ విజయ్‌సేరెడ్డి ధర్మాసనం విచారించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు కమిషన్ నివేదిక అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే కేసుకు సంబంధించి పలువురు పోలీస్ అధికారులు దాఖలు చేసిన వేరే వ్యాజ్యాలను కూడా న్యాయమూర్తి విచారించారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్ అధికారులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. తదుపరి విచారణను జూలై నెలకు వాయిదా వేశారు.