24-11-2025 12:00:00 AM
కోమటిరెడ్డి వర్గానికి మొండిచెయ్యి
రెండుచోట్ల రేవంత్ వర్గానికి పెద్దపీట
నల్లగొండ, నవంబర్ 23 (విజయక్రాంతి) : డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాల మొదలయ్యింది. నల్లగొండ జిల్లాలో ఏండ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా పార్టీని తిట్టినోళ్లకే పదవులు కట్టబెట్టారంటూ విమర్శల పర్వం ఎక్కుపెట్టారు. మరోవైపు యాదాద్రిభువనగిరి జిల్లాలో ఒక్కరికే మూడు పదవులు కట్టబెట్టారంటూ అసంతృప్తి బహిర్గతమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు డీసీసీ అధ్యక్షుల ఎంపిక వివాదస్పదమయ్యింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు జిల్లాల్లో రెండు జిల్లాలకు బీసీలను డీసీసీ అధ్యక్షులుగా నియమించడం పట్ల హర్షిస్తుంటే.. మరోవైపు పెద్దగా ప్రయోజనం లేని పార్టీ పదవులను బీసీలకు ఇచ్చి.. పవర్ ఉండే పదవులను రెడ్డి సామాజిక వర్గాలకు ఇచ్చారంటూ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే..
నల్లగొండ డీసీసీతో పాటు యాదాద్రిభువనగిరి డీసీసీలను బీసీలకు కట్టబెట్టడంతో పాటు రేవంత్ రెడ్డి వర్గంగా ముద్ర పడిన పున్న కైలాష్ నేత, బీర్ల అయిలయ్య యాదవ్కు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి వర్గానికి చెక్ పెట్టేందుకే డీసీసీ పీఠాలను పున్న, బీర్లకు ఇచ్చారనే వాదన లేకపోలేదు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ కోమటిరెడ్డి వర్గం పట్టు కోల్పోతుందనే ప్రచారం నేపథ్యంలో రెండు జిల్లాల డీసీసీలను రేవంత్ రెడ్డి వర్గానికి ఇవ్వడం మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పాలి.
ఒక్కరికే మూడు పదవులా..?: పోత్నక్ ప్రమోద్
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్కరికే మూడు పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు భగ్గమంటున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను ఎంపిక చేయడంపై పీసీసీ ప్రధాన కార్యదర్శి, భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోత్నక్ ప్రమోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏండ్లుగా భువనగిరిలో పార్టీని నిలబెట్టినాం..
కష్ట కాలంలో పార్టీ జెండా మోసినాం.. అయినా కాంగ్రెస్ పార్టీ తమకు న్యాయం చేయలేదని అసంతృప్తిని వెళ్లగక్కారు. బీర్ల అయిలయ్య ఇప్పటికే ఆలేరు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా ఉన్నారని, అయినా ఆయనకే డీసీసీ కట్టబెట్టడం ఏంటంటూ నిలదీశారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం విద్యార్థి రాజకీయాల నుంచి నేటి వరకు పార్టీ అభివృద్ధి కోసం ఈ పని చేశామన్నారు.
అయినా తమను గుర్తించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచి నేటి వరకు పార్టీ జెండా మోస్తున్న తమను నాయకత్వం గుర్తించకపోతే తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే బాధ్యతగల పదవిలో ఉండి ప్రతిపక్ష పార్టీలను ప్రోత్సహించే వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.
తమకు పార్టీలో పదవులు వచ్చినా రాకపోయినా గుర్తింపు ఇవ్వకపోయినా జెండా భుజాన వేసుకొని పార్టీ కోసం పనిచేస్తామన్నారు. ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లకు పెద్దపీట వేసి ప్రోత్సహిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్‌లో తిట్టినోళ్లకే పదవులు: గుమ్ముల మోహన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో తిట్టినోళ్లకే పదవులకు దక్కుతాయని కాంగ్రెస్ నేత గుమ్ముల మోహన్ రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా డీసీసీ పీఠంపై గంపెడాశలు పెట్టుకున్న గుమ్ములకు మొండిచెయ్యి మిగిలింది. బీసీ నేత పున్న కైలాష్ నేతకు డీసీసీ పదవి దక్కిన నేపథ్యంలో గుమ్ముల మోహన్ రెడ్డి నల్గొండలోని మంత్రి వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ప్రతిసారి డీసీసీ పోస్ట్ అడిగినా.. మంత్రి కోమటిరెడ్డి అనుచరడనే పేరు, కులం తనకు అడ్డుగా వచ్చిందన్నారు. కులం నా డీసీసీ పదవిని లాక్కుందని. కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకున్నా డీసీసీ కావొవచ్చునన్నారు. సీనియారిటీ, నా సర్వీస్ ఎందుకు పనికిరాలేదని.. ఎవరిని నొప్పించకుండా రాజకీయాలు చేస్తే పక్కకు పెట్టారన్నారు. అవసరమైనప్పుడు 5వేలమందితో ర్యాలీ తీశానని..
మా నాన్న ఎమ్మెల్యే నో, ఎంపీ నో అయితే నాకు ఎమ్మెల్యే పదవి వచ్చేదంటూ వ్యాఖ్యానించారు. తాను నమ్మిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇది కాదని.. రెడ్డి కులం డీసీసీకి అడ్డు అయితే వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. పార్టీ లైన్ దాటకుండా పని చేయడం కోమటిరెడ్డి నేర్పారని.. అదే పద్ధతిలో రాజకీయాలు ఉంటాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి నల్లగొండలో సభ పెడితే తానే ముందున్నానన్నారు. సీఎం దగ్గర ఉన్న పటేల్ రమేశ్ రెడ్డికి పర్యాటక కార్పొరేషన్ పదవి వచ్చిందన్నారు. రేవంత్కు దగ్గరగా ఉన్న చామల కిరణ్కుమార్రెడ్డి, రఘువీర్ రెడ్డి ఇద్దరు ఎంపీలు అయ్యారని..
నియోజకవర్గం మొత్తం నా పేరు డీసీసీకి ఓకే అన్నారని.. అధిష్టానం మాత్రం కులం పేరు చెప్పి అడ్డుకుందని ఆరోపించారు. తన తర్వాత వచ్చిన 20 మంది కి కార్పొరేషన్ పదవులు ఇచ్చారని.. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్తానని చెప్పినా వద్దని చెప్పానన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో వలస నాయకులకే పెద్దపీట వేశారని ఆరోపించారు. ఇదిలావుంటే.. ఈ పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.