3 September, 2026 | 5:23 AM

మా ఇంట్లో దేవుడు లేడు.. మాది నాస్తిక కుటుంబం!

03-09-2026 | 02:50am

తాము పూర్తిగా నాస్తిక వాతావరణం ఉన్న ఇంట్లో పెరిగామని, తమ ఇంట్లో ‘దేవుడు’ అనే భావనే ఉండేది కాదని శ్రుతి హాసన్ తెలిపింది. లోకనాయకుడు కమల్‌హాసన్ (World Leader Kamal Haasan) కుమార్తె ఇలా తన పెంపకం, కుటుంబ నాస్తిక భావాలపై ఆసక్తికర విషయాలను పంచుకోవటం సంచలనంగా మారింది. ఒక టాక్ షోలో పాల్గొన్న శ్రుతిహాసన్ తన బాల్య విశేషాలతోపాటు తండ్రితో ఉన్న వైరుధ్యాలపై ఓపెన్ అయ్యింది. “మేము చాలా భిన్నమైన, నాస్తిక వాతావరణం ఉన్న ఇంట్లో పెరిగాం.

నేను ఈ మాట చెబితే మా నాన్నకు అస్సలు నచ్చదు (నవ్వుతూ). కానీ నిజం చెప్పాలంటే మా ఇంట్లో దేవుడి ఫోటోలు కానీ, పూజలు, సాంప్రదాయ వ్రతాలు కానీ ఏవీ ఉండేవి కావు. మంగళవారం నాన్-వెజ్ తినకూడదు లాంటి నియమాలు అస్సలు లేవు. వేరే వాళ్ల ఇళ్లల్లో పూజలు చూసినప్పుడు మాకు ఆ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించేది. అయితే, చిన్నప్పుడే నాకొక ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మా ఇంట్లో ‘కళ’ మాత్రమే దేవుడు అని!

చిన్నప్పుడు ఒకసారి నేను తెలియక అమాయకంగా ఓ మై గాడ్ (అయ్యో దేవుడా) అని అనగానే, పక్కనే ఉన్న మా నాన్న వెంటనే స్పందిస్తూ.. ‘దేవుడా? ఎక్కడున్నాడు ఆయన? నాకు చూపించు’ అని ప్రశ్నించారు. ఆయనలోని బలమైన నాస్తిక భావజాలానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. జ్యోతిష్యం అంటే మా నాన్నకు పడదు. ఆయన అత్యంత ప్రాక్టికల్, క్రియేటివ్ పర్సన్. నాన్న ముందు ఎవరైనా జ్యోతిష్యం, జాతకాలు అని మాట్లాడితే ఆయన అస్సలు సహించలేరు.

వెంటనే ‘ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటారు. ఆయన ఆలోచనలు చాలా హేతుబద్ధంగా ఉంటాయి” అని తెలిపింది. అయితే, తన కుటుంబం నాస్తికత్వంలో ఉన్నప్పటికీ శ్రుతిహాసన్ మాత్రం తన సొంత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ఆమె ప్రకృతి ఆరాధనతో కూడిన ‘వికా’ (ఒక రకమైన ఆధునిక ప్రకృతి పూజ/ఆధ్యాత్మికత), ‘పేగనిజం’ వైపు ఆకర్షితురాలైంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘మా కుటుంబంలోని స్త్రీల తరాల నుంచి వచ్చిన మాతృస్వామ్య శక్తి వల్లే నేను ఈ మార్గం వైపు నడిచానని నమ్ముతా.

‘ఏ మంత్రగత్తెలను అయితే మీరు కాల్చి బూడిద చేయలేకపోయారో, మేము వారి మనవరాళ్లం’ అనే ఒక అందమైన కోట్ నాకు చాలా ఇష్టం. నా పూర్వీకులైన మహిళల రక్తం నాలో ప్రవహిస్తున్నట్లు నేను భావిస్తాను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రుతి ఇంకా మాట్లాడుతూ.. ‘నా తిరుగుబాటును నాన్న గౌరవించారు. నా ఆలోచనలు, నమ్మకాలు మా నాన్న కంటే భిన్నంగా ఉన్నప్పటికీ, ఆయనెప్పుడూ నన్ను నిరోధించలేదు.

నా జీవితాంతం నా తిరుగుబాటును చూస్తూనే ఉన్నారు. ఆయనకు టాటూలు అంటే అస్సలు నచ్చవు, కానీ నా ఒంటిపై ఐదు టాటూలున్నాయి. నేను దెయ్యం కళ్లద్దాలు, పింక్ కలర్ జుట్టు వేసుకుని తిరిగినా ఆయన నన్ను భరించారు. మా నమ్మకాలు వేరైనా ఆయన నా అభిప్రాయాలను ఎప్పుడూ గౌరవిస్తారు” అంటూ కమల్ హాసన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది శ్రుతి హాసన్.