శింబు సరసన ఛాన్స్?
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Star Director Vetrimaaran) దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘అరసన్’ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ యాక్షన్ డ్రామాలో శింబుతోపాటు ప్రియాంక మోహన్, ఆండ్రియా జెర్మియా, సముద్రఖని, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ సినిమా పూర్తి కాకముందే శింబు తన తదుపరి ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టేశారు. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాల దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇదిలావుండగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో శింబు సరసన హీరోయిన్‌గా టాలీవుడ్ యంగ్ బ్యూటీ మానస వారణాసి నటించబోతోందనేదే ఆ వార్తల సారాంశం. అంతేకాకుండా ఈ చిత్రంలో రియా శింబు కూడా ఒక కీలక పాత్రలో అలరించనున్నారట. మానస వారణాసి ఇటీవలే ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాగా, మంచి ఆదరణ దక్కింది. మరి తాజా చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైందనేది ఎంతవరకు నిజమనేది అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే.






