1 September, 2026 | 1:04 AM

బీజేపీ, బీఆర్‌ఎస్ ఆరోపణల్లో వాస్తవాలు లేవు

01-09-2026 12:27 AM

హనుమకొండ, ఆగస్టు 31(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే రాజకీయంగా పెట్టుకున్న కొందరు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా, విషయం లేని ఆరోపణలు చేయడం సరికాదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే తప్ప తమకు పూట గడవదన్నట్టుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

వచ్చీరాని భాషతో, సబ్జెక్ట్ లేని కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ విమర్శలు చేయాలంటే ఆధారాలతో, వాస్తవాలతో మాట్లాడాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని, ఉద్యోగులు, ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన అనేక అంశాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు సవాళ్లుగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే తెలిపారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు సుమారు రూ.5,300 కోట్లు, శాశ్వత తాగునీటి వసతుల కోసం రూ.550 కోట్లకు పైగా నిధులతో పనులు చేపడుతున్నామని చెప్పారు.

నగర ప్రజలకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామన్నారు.వరంగల్ ఎయిర్పోర్ట్ అంశంపై గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కు కనీసం అనుమతులు తీసుకురాలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కు అవసరమైన అనుమతుల కోసం కృషి చేయడంతో పాటు భూసేకరణకు భారీగా నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లిందన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల అభివృద్ధికి ఇటీవల రూ.25 కోట్లు మంజూరు చేయించామని, కాజీపేట, వరంగల్ అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు చర్చకు రావాలని, గత పదేళ్లలో వారు ఏం చేశారో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందో ప్రజల ముందే తేల్చుకుందామని సవాల్ విసిరారు.