1 September, 2026 | 1:41 AM

కంప్యూటర్ ఆపరేటర్ల సేవలకు గుర్తింపు ఏదీ?

01-09-2026 12:19 AM
  1. తహసీల్దార్ కార్యాలయాల్లో ఏళ్లుగా సేవలు
  2.    20 ఏళ్ల సేవలను గుర్తించని ప్రభుత్వం
  3. ఉద్యోగ భద్రత లేక ఆపరేటర్ల ఆందోళన
  4. నెలల తరబడి అందని వేతనాలు
  5. ధీనస్థితిలో కంప్యూటర్ ఆపరేటర్లు

వెంకటాపూర్, ఆగస్టు 31 (విజయక్రాంతి): తహసీల్దార్ కార్యాలయాల్లో గత 20 ఏళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా సేవలందిస్తున్న తమను విధుల నుంచి తొలగించడం సరికాదని కంప్యూటర్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ సేవల్లో భాగస్వాములుగా ఉంటూ ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాల జారీతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆన్లైన్ సేవలు, రెవెన్యూ శాఖకు సంబంధించిన కీలక పనులను నిర్వహించామని వారు తెలిపారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

తమపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇన్నేళ్లుగా పనిచేసిన తర్వాత ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా చేసిన పనికి కూడా వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందన్నారు.

ఖాళీల్లో సర్దుబాటు చేయాలి

రెవెన్యూ శాఖలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇంతకాలం సేవలందించిన కంప్యూటర్ ఆపరేటర్ల అనుభవాన్ని ప్రభుత్వం గుర్తించాలని వారు కోరారు. వీఆర్‌ఏలకు అవకాశం కల్పించిన విధంగానే తమ 20 ఏళ్ల సేవలను పరిగణనలోకి తీసుకుని సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేసి కంప్యూటర్ ఆపరేటర్లను సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించాలి

ఎన్నికల సమయంలో తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కంప్యూటర్ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ దీర్ఘకాలిక సేవలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.

అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాం

తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్నో ఏళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా సేవలందిస్తున్నాం. ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాల జారీతో పాటు ప్రభుత్వ పథకాల ఆన్లైన్ పనులు, ఇతర రెవెన్యూ సేవలను నిర్విరామంగా అందించాం. ఇంతకాలం సేవ చేసిన మమ్మల్ని ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడం బాధాకరం. వేతనాలు రాక ఇన్నాళ్లు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించి దీనస్థితిలో జీవిస్తున్నాం.

రెవెన్యూ శాఖలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మా 20 ఏళ్ల సేవలను ప్రభుత్వం గుర్తించాలి. వీఆర్‌ఏలకు అవకాశం కల్పించిన విధంగానే కంప్యూటర్ ఆపరేటర్లకు కూడా సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేసి సర్దుబాటు చేయాలి. గత కొన్ని నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలి.

 భూపెల్లి రమేష్, కంప్యూటర్ ఆపరేటర్