calender_icon.png 4 July, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనుల్లో టైమ్ ఫ్రేమ్ ఉండాలి

04-07-2025 12:37:58 AM

  1. నిర్దిష్ట సమయంలో పనిచేయకపోతే చర్యలు తప్పవు

అధికారులతో రివ్యూ మీటింగ్లో కలెక్టర్ హైమావతి హెచ్చరిక

హుస్నాబాద్కు రింగ్ రోడ్డు ప్లానింగ్ ఇవ్వాలని ఆదేశం

హుస్నాబాద్, జూలై 3 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్దిష్ట సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని, నిర్దిష్ట సమయంలో పనిచేయకపోతే చర్యలు తీసుకోవడానికి వెనకాడనని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.

గురువారం హుస్నాబాద్ లోని మున్సిపల్ ఆఫీసులో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ సమీక్షలో ముఖ్యంగా రహదారుల నిర్మాణ పనులపై దృష్టి సారించారు. కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నిర్మించే నాలుగు లైన్ల రహదారి పనులకు సంబంధించిన అనుమతులను ఆయా శాఖల అధికారులు త్వరగా ఇవ్వాలని ఆదేశించారు.

టెండర్ విధానాన్ని పూర్తి చేసి, రోడ్డుకు ఇరువైపులా చెట్లను నరకడం, తొలగించడం ఈ నెల చివరికల్లా పూర్తి చేయాలని, వెంటనే రోడ్డు పనులు ప్రారంభం కావాలని ఆర్‌అండ్బీ అధికారులను ఆదేశించారు. ప్రతి పనికి ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని పనిచేయాలన్నారు.

అలాగే, హుస్నాబాద్ నుంచి జనగామ వరకు నిర్మించే రోడ్డు నిర్మాణం ప్రపోజల్ స్టేజ్లో ఉందని తెలిపారు. హుస్నాబాద్ రింగ్రోడ్డు ప్లానింగ్ను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మూలమలుపులు ఎక్కువగా లేకుండా, వాహనదారులు సులభంగా ప్రయాణించేలా మ్యాపింగ్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

* మౌలిక వసతులు, భూసేకరణలో పురోగతి

మౌలిక వసతుల కల్పన, భూసేకరణ పనుల పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు. అంతకపేటలో 220 కేవీ విద్యుత్ జంక్షన్కు అవసరమైన 10 ఎకరాల స్థలం తహసిల్దార్ వద్ద సిద్ధంగా ఉందని, ట్రాన్స్కో అధికారులు వెంటనే అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లెల గడ్డ వద్ద శాతవాహన ఇంజినీరింగ్ కళాశాలకు సంబంధించిన స్థల సేకరణ పూర్తయిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు రాగానే ఇంజినీరింగ్ అధికారులకు అందిస్తామని తెలిపారు.

కొత్తచెరువు బండ్ డెవలప్మెంట్ కోసం ఇరిగేషన్ అధికారులు తక్షణమే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని అందించడం కోసం బస్వాపూర్, పోరెడ్డిపల్లిలో కాలువల భూసేకరణ ప్రక్రియ అవార్డ్ స్టేజ్ పూర్తయిందని తెలిపారు. సింగరాయకొండ ప్రాజెక్ట్ ద్వారా కొత్త ఆయకట్టుకు నీరు అందించడం కోసం కాలువల భూసేకరణ పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు.

* విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధిపై దృష్టి

పట్టణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లోని పనులను కలెక్టర్ సమీక్షించారు. హుస్నాబాద్లో ఆర్టీఏ యూనిట్ ఆఫీస్ కోసం భూమిని అందించామని, ఇది ప్రస్తుతం ప్రపోజల్ స్టేజ్లో ఉందని తెలిపారు. డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సుల్లో భాగంగా ఎం.కామ్ కోర్సు 60 సీట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో 150 పడకల ఆసుపత్రి నిర్మాణం, కోహెడలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, ఇండస్ట్రియల్ పార్కు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, స్పోరట్స్ స్టేడియంలో ఆడిటోరియం, స్విమ్మింగ్ పూల్, జిమ్ ప్రపోజల్ వంటి అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై కూడా కలెక్టర్ అధికారులతో చర్చించారు. అన్ని పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.