04-07-2025 11:37:51 AM
మణికొండ: రహదారుల పక్కన ఫుట్ పాత్(Footpath) లను ఆక్రమించి పాన్ డబ్బాలు, టీ కొట్లు, ఇతర వ్యాపారాలు జరుపుతున్నారు కొందరు. ఇలాంటి ఫుట్ పాత్ ఆక్రమణల(Footpath Encroachments) వల్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవుతున్నాయి. మణికొండలో ఫుట్ పాత్ లపై అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. హరివిల్లు రోడ్డు నుంచి తారా కిచెన్స్ వరకు జరుగుతున్న ఈ ఆక్రమణలపై ఇటీవల విజయక్రాంతి కథనాలు ప్రచురించింది. స్థానికులు కూడా స్పందించి అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు మున్సిపల్, రెవెన్యూ అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. హరివిల్లు రోడ్డు నుంచి తారా కిచెన్స్ వరకు ఆక్రమణలు తొలగించాలని సదరు వ్యక్తులకు ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ డబ్బాలు, నిర్మాణాల తొలగింపునకు మున్సిపల్ కమిషనర్ టెండర్స్ పిలవగా, కాంట్రాక్టర్లు ఎవరూ ఆసక్తి చూపలేదు. మరోసారి టెండర్స్ పిలుస్తామని అధికారులు చెబుతున్నారు. ముందుగా డబ్బాల తొలగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు. క్రమంగా ఫుట్ పాత్ లపై ఉన్న మొత్తం అక్రమ నిర్మాణాలను లేకుండా చేస్తామని అధికారులు చెబుతున్నారు.