02-02-2026 01:45:19 AM
మున్సిపోల్స్‌లో రెబల్స్ లేకుండా చూసుకోవాలి
క్షేత్రస్థాయిలో పార్టీ బాగుంది
త్వరలో చాలా మంది బీఆర్‌ఎస్‌లో చేరుతారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయని.. పార్టీ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతున్నదని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సిట్ విచారణ అనంతరం నం దినగర్‌లోని కేసీఆర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలపై వారిలో చర్చించారు. పార్టీ క్షేత్రస్థాయిలో బాగుందని.. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకూ బలోపేతం అవుతున్నదని చెప్పారు.
త్వరలోనే చాలా మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బరిలో లేకుండా చూసుకోవాలని, అవసరమైతే వారిని కూర్చొబెట్టి మాట్లాడి బుజ్జగించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో చాలా వరకు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయబోతున్నామని చెప్పారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎమ్మెల్యేలు, మిగితా నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.