04-05-2025 01:12:46 AM
తెలంగాణలో జరిగింది కులసర్వే మాత్రమే
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ చేపట్టింది కులగణన కాదని, అది కేవలం కుల సర్వే మాత్రమేనని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు. కులగణన చేస్తున్నామని చెబు తూ ప్రభుత్వం కనీసం ఉత్తర్వులు కూడా ఇవ్వలేదని, కలెక్టర్లకు పంపిన సర్క్యూలర్‌లోనూ ఆ విషయం లేదని ఆయన తెలిపా రు. దీనిపై చర్చకు తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
కేంద్రం గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జాతీయ రహదారులను నిర్మిస్తోందని ఆయన వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో బీసీలకు అన్యాయం చేసేలా.. మత ప్రాతిపదికన ముస్లింలను బీసీ జాబితాలో చేర్చిం దన్నారు. కులగణన అంటే రాజ్యాంగం ప్రకారం, చట్టప్రకారం చేయాలన్నారు.
కేంద్రప్రభుత్వం కులగణన చట్టం ఆధారంగా జనాభా లెక్కలతో పాటు పక్కాగా దేశంలో కులగణనను చేపట్టనుందని స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో ఇప్పటివరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల కాలం పాటు పరిపాలించిన కాం గ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తలేదన్నారు.
మారుమూల ప్రాంతాల్లోని ప్రతీ ఒక్క వ్యక్తి దగ్గరికి, ప్రతీ ఇంటికి వెళ్లి పారదర్శకంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేయనున్నట్టు వెల్లడించారు. దేశంలో మొదటిసారిగా వచ్చే ఏడాది కులగణన చేసేందుకు కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుందన్నారు. దేశంలో కులగణన జరిగితే బీసీలకు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.
ఏ సామాజిక వర్గం వెనకబడి ఉందో గుర్తించవచ్చని వెల్లడించారు. వెనకబడిన వర్గాల వారికి ప్రత్యేక పథకాలను రూపొందించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో చేసిన కులగణన తూతూమంత్రంగా చేసిందేనని అన్నారు. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉన్నందున కులగణన నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాంగ్రెస్‌లా ముస్లింలను బీసీల జనాభాలో చేర్చి మోసం చేయమన్నారు.
5న తెలంగాణకు గడ్కరీ...
కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 5న రాష్ట్రంలో పలు హైవేల ప్రారంభోత్సవాలు, నూతన ప్రాజెక్టులకు భూమిపూజ చేసేందుకు వస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.5,416 కోట్లతో 167 కి.మీ. మేర మొత్తం 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించిన ప్రారంభో త్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద, హైదరాబాద్ అంబర్‌పేట్‌లో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు. నిర్మల్ మంచిర్యాల -రేపల్లెవాడ, రేపల్లెవాడమహారాష్ర్ట సరిహద్దు, ఎన్‌హెచ్‌ెే202పై హైదరాబాద్, అంబర్‌పేట 6నం.
జంక్షన్ వద్ద 1.47 కి.మీ మేర రూ.415 కోట్లతో నిర్మించిన ఫ్లుఓవర్, ఎన్‌హెచ్ హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ జంక్షన్ వద్ద రూ.172.56 కోట్లతో నిర్మించిన ఫ్లుఓవర్ ప్రారంభోత్సవాలతో పాటు ఎన్‌హెచ్ హైదరాబాద్ సెక్షన్‌లో ఆరాంఘర్- మధ్య 10 కి.మీ మేర 6 లేనింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. వీటితో పాటు అనేక హైవే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లోనూ గడ్కరీ పాల్గొంటారని తెలిపారు.
రాష్ట్రంలో రెట్టింపైన జాతీయ రహదారులు..
2014లో తెలంగాణలో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉండగా, ఇప్పుడు అవి సుమారు 5,200 కి.మీ. పెరిగాయని కిషన్‌రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.1,25,485 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులు, కీలక ఎకనామిక్ కారిడార్లు, పర్యాటక ప్రోత్సాహక ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి బాంబే, నాగపూర్ రోడ్డు, వరంగల్ ద్వారా భూపాలపల్లి రోడ్డు, విజయవాడ ద్వారా చెన్ను రోడ్, కర్నూలు ద్వారా బెంగళూరు రోడ్ వంటి అనేక జాతీయ రహదారుల ద్వారా కనెక్టివిటీ పెంపొంచామన్నారు.
హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు జాతీయ రహదారి -765పై మన్ననూరు నుంచి తెలంగాణ- సరిహద్దు వరకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. హైదరాబాద్ విజయవాడ మధ్య ఎన్‌హెచ్ 6 లేన్లకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నత్తనడకన భూసేకరణ..
తెలంగాణలో పలు రోడ్డు, రవాణా ప్రాజెక్టులు భూసేకరణ ఆలస్యమవుతున్న కారణంగా నత్తనడకన నడుస్తున్నాయని కిషన్‌రెడ్డి వాపోయారు. ఈ విషయంలో గత సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఒకేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేల పేరుతో రవాణా వ్యవస్థను సరళతరం చేసేలా దేశవ్యాప్తంగా రూ. 4.5 లక్షల కోట్ల ఖర్చుతో 10 వేల కి.మీ మేర గ్రీన్‌ఫీల్డ్ కారిడార్స్ నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు.
రాష్ర్ట పరిధిలో దాదాపు రూ.4500 కోట్లతో 136 కి.మీ. మేర పనులు జరుగుతున్నాయన్నారు. రూ.40,615 కోట్లతో సూరత్--సోలాపూర్--చెన్ను కారిడార్, రూ.6 వేల కోట్లతో హైదరాబాద్--విశాఖపట్నం కారిడార్, నాగ్‌పూర్--విజయవాడ కారిడార్, హైదరాబాద్-గోవా కారిడార్ పరిధిలోని పనుల్లో రాష్ట్రంలో రూ.3170 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కారిడార్ల నిర్మాణం కోసం దాదాపు కేంద్రం రూ.లక్ష కోట్లను వెచ్చిస్తోందన్నారు.