ఇవేం.. రోడ్ల మరమ్మతు పనులు!
- కానరాని ఆర్‌అండ్‌బీ అధికారులు పర్యవేక్షణ
ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు రోడ్ల నిర్మాణ పనులు
నాణ్యత లోపంతో నిర్మించిన కొద్దిరోజుల్లోనే దెబ్బతింటున్న రోడ్లు
గుంజోట్టి గ్రామ శివారులో దెబ్బతిన్న రోడ్లు
జహీరాబాద్, జూన్ 17: పనుల్లో నాణ్యత లోపం వల్ల రోడ్లు వేసిన కొద్ది రోజులకే దెబ్బతింటున్నాయి. కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వెరసి కోట్లాది రూపాయలు బురదలో పోసిన పన్నీరులాగా మారుతున్నాయి.. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం ముంగి ఆదిలక్ష్మిఆలయం నుండి రాంతీర్థం, గుంజోట్టి, వడ్డి, శంశోల్లాపూర్ గ్రామాల మీదుగా కర్ణాటక సరిహద్దు ఆర్‌అండ్‌బీ రోడ్డు అక్కడక్కడ దెబ్బతిన్నది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1.46 కోట్లు మంజూరయ్యాయి. గుంజోట్టి గ్రామాల శివారులో 3.6 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతులు చేపట్టిన కొద్ది కాలానికే మళ్లీ గుంతలు పడ్డాయి.
అయితే, ఈ మార్గంలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉంటాయని, అందుకే రోడ్డు తరచూ రిపేరుకు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అయితే, కాంట్రాక్టర్ ఇవేమీ పట్టించుకోకుండా కేవలం పైపైమెరుగులు దిద్దుతూ చేతులు దులుపుకుంటున్నాడు. వాస్తవానికి రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతంలో దెబతిన్న భాగాన్ని తవ్వి, మెటలింగ్ వేసి సరైన క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ, కాంట్రాక్టర్లు అలా చేయకపోవడంతో రోడ్డు సమస్య.. సమస్యగానే మిగులుతోంది. చేసిన పనులను పరిశీలించాకే బిల్లులు మంజూరు చేయాల్సిన అధికారులు పనులను చూసీచూడనట్లుగా చూసి బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి బాగు చేయించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత ఆర్‌అండ్‌బీ ఏఈ సంధ్య దృష్టికి తీసుకెళ్లగా.. ఆయా గ్రామాల మధ్య నిర్మించిన రోడ్డును పరిశీలించి బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ రోడ్డు మార్గంలో 15 నుంచి 20 టన్నుల లోడ్‌తో వెళ్లాల్సిన ఇసుక లోడ్‌తో వాహనా లు 50 టన్నులపై లోడ్‌తో వెళ్లడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని, ఆ వాహనాలపై ఎంవీ ఐ అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఆయా గ్రామాల మీధుగా రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్గొన్నారు.






