కొనలేం.. తినలేం
- ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు
ఏది ముట్టుకున్నా కిలో రూ.80 పైనే
ఆకు కూరలదీ అదే పరిస్థితి
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారుతున్నాయి. ఏది ముట్టుకున్నా కిలో రూ.80 పైనే ధర పలుకుతున్నాయి. ప్రధానంగా టమాట ధరలు ఆకాశాన్నంటాయి. వికారాబాద్ బీట్ల మార్కెట్‌లో కిలో టమాట రూ.100 ధర పలుకుతుండగా, బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.120కి అమ్ముతున్నారు. గత పది రోజుల వరకు మామూలు ధరనే ఉన్న టమాట అమాంతం పెరిగి పోయింది. ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి.
క్యాప్సికమ్ వంటివి రూ.80 కి పైగానే పలుకుతున్నాయి. కిలో ఉల్లి రూ.50 అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కొనుగోలుదారులకు మరింత ఘాటును చూపిస్తుండగా, ఆకు కూరలు సైతం ధరల్లో కూరగాయలతో పోటీ పడుతున్నాయి. దీనికంతటికి కారణం కూరగాయల దిగుబడి ఎక్కువగా లేకపోవడమేనని వ్యాపారులు అంటున్నారు.
వికారాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో కూరగాయాల సాగు పెద్దగా లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువగా తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా దళారులు ధరలు పెంచేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా బోరుబావుల ద్వారానే పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా నవాబుపేట్, పూడూరు, వికారా బాద్, మోమిన్‌పేట్, మర్పల్లి, పరిగి వంటి కొన్ని మండలాల్లోనే కూరగాయల సాగు అధికంగా ఉంటుంది.
టమాట, వంకాయ, బెండ, బీర, దొండ, చిక్కుడు, ఉల్లి, పచ్చిమిర్చి, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ వంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. కొన్నిప్రాంతా ల్లో ఆకుకూరలు పండిస్తున్నారు. నవాబుపేట్, వికారాబాద్, పూడూరు మండలాల రైతులు అధికంగా హైదరాబాద్ మార్కెట్‌కు తరలిస్తుంటారు. చిన్నచిన్న రైతులు పండించే కూరగాయలు మాత్రమే స్థానిక మార్కెట్లకు వస్తుండడంతో కొరత ఏర్పడి ధరలు మండిపోతున్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి..
జిల్లాలో కూరగాయల దిగుబడి లేకపోవడంతో కమీషన్ ఏజెంట్లు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నారు. ప్రధానంగా ఏపీలోని కర్నూల్, అనంతపురంతో పాటు హైదరాబాద్ నుంచి తీసుకొ స్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంత కూరగాయలు వచ్చినా డిమాండ్‌కు సరిపోవడం లేదు. కమీషన్ ఏజెంట్ల వద్ద వ్యాపారులు ధర ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేసి రైతు బజారులో రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు పెద్దగా లేకపోయినా ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు నివ్వెరపోతున్నారు.
ఆకుకూరలు గతంలో రూ.10కి రెండు కట్టలు ఇచ్చేవారు. ఇప్పుడు రైతు బజారులో రూ.20కి మూడు కట్టలు మాత్రమే ఇస్తున్నారు. ఆకు కూరల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో చాలామంది వాటిని కొనడానికి వెనుకడుగు వేస్తున్నారు. వికారాబాద్ రైతు బజారులో బోర్డుపై ఒక రేటు ఉండగా అక్కడి వ్యాపారులు, రైతులు అధిక రేట్లకు అమ్ముతు న్నారు. అక్కడి సిబ్బంది పెద్దగా పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.






