11-05-2025 12:00:00 AM
డాక్టర్ యం. అఖిలమిత్ర, ప్రకృతి వైద్యులు
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలు కూడా చేరుకోలేదు. ‘అందరికీ ఆరోగ్యం’ అన్న లక్ష్యం ఇంకా దూరంగా వున్నది. అయితే కొన్ని అంశాలలో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నాం. ఫార్మా, వ్యాక్సిన్ రంగాల్లో ఒక అడుగు ముందుకేశాం. ఆధునిక జీవన శైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లతో మూడు ప్రధాన సమస్యలు మానవాళిని వెంటాడుతున్నాయి. అధిక రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం.
డయాబెటిస్, అధిక రక్తపోటు హృదయ సంబంధ వ్యాధులకు ప్రధాన కారకాలు. ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు ఇవి కారణం. గత రెండు దశాబ్దాలలో మధుమేహం 80శాతం పెరిగింది. ఒక అధ్యయనం ప్రకారం.. 2,245 మందిలో 15.5శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు, 17.2శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆల్కహాల్ తాగేవారిలో డయాబెటిస్ మూడింట ఒక వంతు ఉన్నది. బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే ఎక్కువ ఉన్నవారిలో కూడా అధిక రక్తపోటు ఎక్కువగా కనిపిస్తుంది.
రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం ప్రపంచమంతా నిత్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. కేవలం నగరాలు, పట్టణాలు కాకుండా పల్లెల్లోనూ ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రతి పది మందిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి మధుమేహం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో 26 శాతం, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులున్నారు. అదే డయాబెటిస్ విషయానికొస్తే పల్లెల్లో 20 శాతం, పట్టణాల్లో 25 శాతం బాధితులున్నారు. చాలామంది అవగాహన లేక, నిర్లక్ష్యంతో ఈ రెండింటిని నియంత్రించుకోలేకపోతున్నారు.
చిన్న సమస్య కాదు!
భారతదేశంలో ఊబకాయం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఊబకాయం అనేది చిన్న సమస్య కాదని.. ఇది వ్యాధి అభివృద్ధికి కారణమని చెబుతున్నది. ఊబకాయం ఒక రకమైన వ్యాధి. మనదేశంలో దీన్ని ఒక సమస్యగా భావిస్తారు. ఊబకాయాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తే, ప్రజలు ఊబకాయం బారిన పడకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. స్థూలకాయం అంటే శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం అని నిర్వచించారు.
బాడీ మాస్ ఇండెక్స్ ఆరోగ్యకరమైన బరువును నిర్ణయించడానికి ఒక ప్రసిద్ధ మార్గం. బీఎంఐ, నడుము పరిమాణంలో కలిపి, శరీర కొవ్వు శాతాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీర బరువు కంటే మరింత ఖచ్చితమైన అంచనా కోసం ఎత్తు, బరువు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఒక వ్యక్తి బాడీ మాస్ ఇండెక్స్ 25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. ఊబకాయం ఏర్పడుతుంది. శరీరంలో అధిక కొవ్వు తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలి మార్పులు చికిత్సలో ప్రధానమైనవి. దీని ప్రభావం గుండె, శ్వాసపై ఎక్కువగా ఉంటుంది. బరువు పెరగడం వల్ల కీళ్లలో నొప్పి మొదలవుతుంది. అందుకే పిల్లల్ని సాధ్యమైనంతవరకు ఆటల వైపు దృష్టి మళ్లించాలి. పెద్దవాళ్లు యోగా లేదా వ్యాయామం అలవాటుగా చేసుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్ తప్పనిసరి చేసుకుంటే ఇంకా మంచిది. శారీరక వ్యాయామం లేకపోతే చిన్న వయసులోనే ఇలాంటి జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.