calender_icon.png 7 June, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతి నడక ప్రమాదమే?

11-05-2025 12:00:00 AM

వాకింగ్ ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు కలిగేందుకు వాకింగ్ ఒక్కటే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం తెలియక అతిగా వాకింగ్ చేసేవారు చివరకు చిక్కుల్లో పడతారని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వయసు మళ్లిన వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. 

2013లో బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం రోజూ 11 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేసే వారికి గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అయితే.. వాకింగ్‌తో పాటు కండరాల బలం, ఫ్లెక్సిబులిటీ పెంచేందుకు ఇతర రకాల కసరత్తులు కూడా చేయాల్సి ఉంటుంది. వాకింగ్ ఎంత మంచిదైనా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యువత, కొత్తగా కసరత్తులు మొదలెట్టేవారికి వాకింగ్‌తో కచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి.

రక్తప్రసరణ పెరిగి శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుపడతాయి. వాకింగ్‌తో ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అయితే.. వయసు పెరిగేకొద్ది కండరాల పుష్టి తగ్గుతుంది. ఎముకలు కూడా బోలుగా మారతాయి. వీటిని అడ్డుకునేందుకు స్టున్త్ ట్రెయినింగ్ ముఖ్యం. కానీ వాకింగ్‌తో ఈ రకమైన ప్రయోజనాలు అంతగా లభించవు. కాబట్టి.. ఇతర రకాల కసరత్తులు కూడా తప్పనిసరిగా చేయాలి. చాలా మందికి ఈ విషయాలపై అవగాహన లేక ఎంతగా నడిస్తే అన్ని ప్రయోజనాలు కలుగుతాయని అనుకుంటూ ఉంటారు.

కొందరు సరైన బూట్లు ధరించకుండానే వాకింగ్ చేస్తుంటారు. ఈ తీరు వృద్ధుల్లో మరిన్ని సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మోకాళ్లు, తుంటిపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. వెన్నెముక దిగువ భాగంలో నొప్పి మొదలవుతుందని అంటున్నారు. కాబట్టి ఇబ్బంది మొదలవుతున్నట్టు అనుమానం రాగానే వాకింగ్ నుంచి విరామం తీసుకోవాలి.

పూర్తిగా కోలుకున్నాకే మళ్లి నడక ప్రారంభించాలి. అవసరమైతే వైద్యులను కూడా సంప్రదించాలి. మంచి షూస్ లేకుండా అస్సలు వాకింగ్ చేయకూడదు. 40 ఏళ్లు దాటిన వారు వాకింగ్‌తో పాటు స్కాట్స్, లంజెస్, ప్లాంక్స, బ్యాండ్స్‌తో చేసే ఎక్సర్‌సైజులు చేస్తే శరీరానికి తగినంత రెస్టిస్టెన్స్ ట్రెయినింగ్ లభించి కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి.