వార్మప్ పోరూ కీలకమే
న్యూయార్క్: పిచ్ పరిస్థితి అధ్యయనం చేయాలంటే వార్మప్ మ్యాచ్ కూడా కీలకమేనని టీమిండియా సారథి రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ఆడేందుకు అమెరికాకు చేరుకున్న భారత జట్టు టోర్నీలో తొలి మ్యాచ్ ఈ నెల 5న ఐర్లాండ్ తో ఆడనుంది. అయితే నేడు బంగ్లా దేశ్‌తో వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమయ్యిం ది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ వార్మప్ మ్యాచ్‌తో పాటు కొత్త గా నిర్మించిన పిచ్ పరిస్థితులపై స్పందించాడు. ‘కొత్తగా నిర్మించిన స్టేడి యం చాలా బాగుంది. ఓపెన్ గ్రౌండ్ కావడంతో ఇలాంటి వేదికలో మ్యాచ్ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాం.
ఇక్కడి పిచ్ కూడా మంచి కండీషన్‌తో ఉంది. ఇంతకముందు అమెరికాలో ఎన్నడూ మ్యాచ్‌లు ఆడలేదు. ఇక్కడి వాతావరణంపై మాకు పెద్దగా అవగాహన లేదు. దీంతో మెగా టోర్నీ ప్రారంభానికి ముందే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ కీలకం కానుంది. ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ పిచ్ అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడనుంది. ఎందుకంటే లీగ్ దశలో ఇదే స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ముందే పరిస్థితులు అర్థమైతే మ్యాచ్ సమయం మాకు కలిసొచ్చే అవకాశముంది. అమెరికాలో క్రికెట్ ఎదుగుతున్న క్రమంలో ఇక్కడ ప్రపంచకప్ జరగనుండడం సానుకూలాంశం. మ్యాచ్‌లకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తారనే భావిస్తున్నా’ అని రోహిత్ పేర్కొన్నాడు.
నేడు బంగ్లాతో వార్మప్ మ్యాచ్
ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. పేరుకు ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ బంగ్లాతో పోరును టీమిండియా సీరియస్‌గా తీసుకుంది. ఇన్నాళ్లు ఐపీఎల్లో వేర్వేరు జట్లకు ఆడిన భారత ఆటగాళ్లు ప్రపంచకప్ కోసం జట్టుగా ఏకమయ్యారు. వ్యక్తిగతంగా మన ఆటగాళ్ల ప్రదర్శన బాగున్నప్పటికీ జట్టుగా ఎలా ఆడతారనేది కీలకం కానుంది. అయితే విరాట్ కోహ్లీ నేడు జట్టుతో కలిసే అవకాశం ఉన్నా.. మ్యాచ్‌కు మాత్రం దూరంగా ఉండనున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో 15 మంది బరిలోకి దిగే చాన్స్ ఉంది. ముఖ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకునే ఆ 11 మంది ఆటగాళ్ల లయ ఎలా ఉందనేది ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ పరిశీలించనుంది. రోహిత్, జైస్వాల్, సూర్య, దూబే, పంత్, శాంసన్, పాండ్యా, జడేజాలతో బ్యాటింగ్‌లో దుర్బేధ్యంగా కనిపిస్తుంది. బౌలింగ్‌లో బుమ్రా మినహా మిగతావాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది కీలకం.






